Etala rajendar: నాకు సంబంధం లేదు మొత్తం ఆ ఇద్దరే చేసిన్రు

Etala rajendar: కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టును విచారిస్తున్న జ్యుడీషియల్ కమిషన్‌ ముందు శుక్రవారం విచారణకు హాజరైన బీజేపీ ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల, “కాళేశ్వరం ప్రాజెక్టులో నాకు ఎటువంటి పాత్ర లేదు. ఆ ప్రాజెక్టు సంబంధిత పూర్తిస్థాయి సమాచారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకే తెలుసు. ఆర్థిక శాఖకు ఇందులో పెద్దగా సంబంధం లేదు” అని స్పష్టం చేశారు.

అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు రీడిజైన్ చేయడంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, హరీశ్ రావు దానికి చైర్మన్‌గా ఉన్నారని గుర్తుచేశారు. మేడిగడ్డ వద్ద ఆనకట్టను నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని నిర్మించారని, అలాంటి నిర్మాణాలు పూర్తిగా సాంకేతిక నిపుణుల ఆధీనంలోనే ఉంటాయని పేర్కొన్నారు. అలాంటి విషయంలో రాజకీయ నేతలకు అంతగా అవగాహన ఉండదన్నారు.

ప్రాజెక్టు వ్యయం విషయానికొస్తే, “మొదట ఈ ప్రాజెక్టును రూ.63 వేల కోట్లతో ప్రతిపాదించారు. కానీ తర్వాత అనేక కారణాలతో అది రూ.82 వేల కోట్లకు పెరిగింది” అని వివరించారు. కమిషన్ తనను ఆర్థిక అంశాలపై ప్రశ్నించిందని, ప్రత్యేకంగా కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలపై ఆర్థిక శాఖ ప్రమేయం ఉందా అని అడిగినట్లు చెప్పారు. దీనిపై “ఆర్థిక శాఖకు ఇందులో ప్రమేయం లేదు. ఇది పూర్తిగా నీటిపారుదల శాఖ పరిధిలోని అంశం” అని ఆయన స్పష్టం చేశారు.

“నా కణతపై తుపాకీ పెట్టినా సరే, నేను నిజం చెప్పడమే చేస్తాను. తప్పులు ఎవరివో ప్రజలే నిర్ణయిస్తారు” అంటూ ఈటల వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుతో సంబంధమైన అన్ని రిపోర్టులు బయటపెట్టాలని, రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని వాడుకోకూడదని హెచ్చరించారు.

కాళేశ్వరం నష్టాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. “ఈ ప్రాజెక్టు తన మానస పుత్రిక అని కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. కానీ నేను ఎలాంటి పదవిలో ఉన్నా, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాను” అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *