Etala Rajendar: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఆర్. కృష్ణయ్య చేస్తున్న సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఇందిరా పార్క్‌లో సోమవారం జరిగిన దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, “ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీసీ సమస్య అడ్డం పెట్టుకుని ఎన్నికలు వాయిదా వేయడం మోసం. బీసీలతో చెలగాటమాడితే భరతం పట్టడం ఖాయం” అని హెచ్చరించారు.
42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి
ఈటల డిమాండ్ ప్రకారం, బీసీలకు 42% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేసి, స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలి. “ఇది వందల మంది చేస్తున్న దీక్ష కాదు. ఇది 50% పైగా ఉన్న బీసీ సమాజం చేస్తున్న దీక్ష” అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై విమర్శలు
కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఎత్తిచూపుతూ ఈటల ప్రశ్నించారు:
“మీరు 1956 నుంచి 50 ఏళ్లు పరిపాలించారు. ఒక బీసీ ముఖ్యమంత్రినైనా చేశారు?”“ఇంకా పదేళ్లు అధికారంలో ఉన్నా, మళ్లీ మీరే ముఖ్యమంత్రులు. బీసీకి అవకాశం లేదు” అని ధ్వజమెత్తారు. ప్రాంతీయ, కుటుంబ ఆధారిత పార్టీల గురించి కూడా వ్యాఖ్యానిస్తూ, “అలాంటి పార్టీలు ఉన్నంతకాలం వాళ్లే అధికారంలో ఉంటారు. బీసీలు పరిపాలన చేసే అవకాశమే లేదు” అని అన్నారు.

