Warren Buffett: ప్రపంచ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఒక అద్భుత శకానికి నేడు తెరపడనుంది. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ‘బెర్క్‌షైర్ హాత్వే’ సంస్థను ప్రపంచస్థాయి దిగ్గజంగా నిలిపిన వారెన్ బఫెట్, బుధవారం తన సీఈఓ పదవికి అధికారికంగా వీడ్కోలు పలుకుతున్నారు. 1965లో ఒక సాధారణ టెక్స్టైల్ కంపెనీగా ఉన్న ఈ సంస్థను తన వ్యూహాలతో బీమా, రైల్వేలు, ఈక్విటీ పెట్టుబడుల సామ్రాజ్యంగా మార్చిన బఫెట్, ఆధునిక కార్పొరేట్ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. ఆయన నిష్క్రమణతో గ్రెగ్ అబెల్ నూతన సీఈఓగా బాధ్యతలు చేపట్టనుండగా, బఫెట్ రెండో కుమారుడు హువర్డ్ బఫెట్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
Also Read: Damien Martyn: విషమ పరిస్థితిలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్
పదవీ విరమణ సందర్భంగా తన ఇన్వెస్టర్లకు రాసిన భావోద్వేగ లేఖలో బఫెట్ తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. 95 ఏళ్ల వయసు వరకు ఆరోగ్యంగా ఉండటం అదృష్టమని పేర్కొంటూ, తన ఎనిమిదేళ్ల వయసులో మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా అపర దాతగా పేరుగాంచిన ఆయన, తన పదవీ విరమణ వేళ మరో 1.3 బిలియన్ డాలర్ల సంపదను నాలుగు కుటుంబ ఫౌండేషన్లకు విరాళంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఆయన సుమారు 50 బిలియన్ డాలర్ల మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించడం గమనార్హం. ఆయన అందించిన పెట్టుబడి సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెట్టుబడిదారులకు ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయి.
