Thalapathy Vijay

Thalapathy Vijay: కోలీవుడ్‌లో ఒక శకం ముగిసింది.. దళపతి విజయ్ సినిమాలకు గుడ్‌బై!

Thalapathy Vijay:  తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అగ్ర కథానాయకుడు, ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ అధినేత దళపతి విజయ్ తన సినీ ప్రస్థానానికి స్వస్తి పలుకుతూ సంచలన ప్రకటన చేశారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో అత్యంత వైభవంగా జరిగిన తన తాజా చిత్రం ఆడియో లాంచ్ ఈవెంట్‌లో వేలాదిమంది అభిమానుల సమక్షంలో విజయ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ తన కెరీర్‌లో ఆఖరి సినిమా అని ఆయన స్పష్టం చేయడంతో కోలీవుడ్‌లో ఒక సుదీర్ఘమైన స్టార్ హీరో శకం ముగియనుంది.

సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఒక చిన్న ఇంటిని నిర్మించుకోవాలనుకున్న తనకు, అభిమానులు ఏకంగా ఒక ‘రాజభవనాన్ని’ నిర్మించి ఇచ్చారని విజయ్ ఉద్వేగానికి లోనయ్యారు. గత 33 ఏళ్లుగా తనను గుండెల్లో పెట్టుకున్న ప్రజల కోసం, తనను నమ్మిన అభిమానుల కోసం రాబోయే 30 ఏళ్లు రాజకీయాల్లో నిలబడి సేవ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కేవలం థాంక్స్ చెప్పి పక్కకు తప్పుకోవడం కాకుండా, ప్రజా సేవలో భాగస్వామ్యం కావడమే తన నిజమైన కృతజ్ఞత అని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే “జీవితంలో గెలవడానికి స్నేహితులు ఎంత అవసరమో తెలియదు కానీ, మిమ్మల్ని మరింత బలవంతులుగా చేసే ఒక శక్తివంతమైన శత్రువు మాత్రం కచ్చితంగా ఉండాలి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

Also Read: Divvela madhuri: మహిళల స్వేచ్ఛ అంటే బట్టలు విప్పుకుని తిరగడం కాదు

విజయ్ ఆఖరి చిత్రంగా వస్తున్న ‘జన నాయగన్’లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. తన కెరీర్ ఆరంభం నుండి ఎదుర్కొన్న విమర్శలను, అవమానాలను తట్టుకొని నిలబడటంలో అభిమానులు అందించిన మద్దతును ఈ వేదికపై విజయ్ గుర్తు చేసుకున్నారు. మలేషియాతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ, తన స్నేహితుడు అజిత్ నటించిన ‘బిల్లా’తో పాటు తన ‘కవలాన్’, ‘గురువి’ వంటి చిత్రాల షూటింగ్ ఇక్కడే జరిగిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

దళపతి విజయ్ సినిమాల నుండి తప్పుకుంటున్నట్లు చేసిన అధికారిక ప్రకటనతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నప్పటికీ, తమ హీరోని పూర్తి స్థాయి ప్రజా నాయకుడిగా చూడబోతున్నామన్న ఉత్సాహంలో ఉన్నారు. విజయ్ తన రాజకీయ పార్టీ TVK ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తుండటంతో, ఈ చివరి సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *