Tajmahal: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కేరళ నుంచి ఒక అనామక ఈమెయిల్ ద్వారా బాంబు ఉంచినట్టు తెలియజేయడంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి.
ఈమెయిల్ సమాచారం ఆధారంగా మూడు గంటల పాటు బాంబ్ స్క్వాడ్ భారీ తనిఖీలు నిర్వహించింది. తాజ్‌మహల్ ప్రాంగణంలో సందర్శకులను ఖాళీ చేయించి ప్రతీ మూలను జాగ్రత్తగా పరిశీలించారు. అనంతరం బాంబు లేదని అధికారులు స్పష్టతనిచ్చారు.
ఈ బెదిరింపు ఈమెయిల్ కేరళ నుంచి వచ్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై సైబర్ క్రైమ్ విభాగం విచారణ ప్రారంభించింది. ఎవరు, ఏ ఉద్దేశంతో ఈ బెదిరింపులు పంపారన్న దానిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ ఘటనతో పర్యాటకులు కొంతకాలం భయభ్రాంతులకు లోనయ్యారు. తాజ్‌మహల్‌కు సంబంధిత భద్రతను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు.

