Eluru: శత్రువులపై పగలు, ప్రతీకారాలు తీర్చుకునే విషయంలో మనషి ఆదికాలం నుంచి రాక్షసుడిగా మారుతూ వస్తున్నాడు. కానీ, ఇటీవల కాలంలో సొంత మనుషులనే కడతేరుస్తూ తమ కసిని తీర్చుకునే ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి. కన్నవారిని, కడుపున పుట్టిన వారినీ, బంధాలను, బంధుత్వాలపై ఇటీవల కత్తి దూస్తున్నారు. ఈజీగా ప్రాణాలను తీసేస్తున్నారు. ఇలా మనిషి ప్రవర్తనలో రాక్షసత్వం జడలు విప్పుకున్నది.
Eluru: తాజాగా కన్నతల్లిని ఆమె పేగు తెంచుకొని పుట్టిన, ఆమె పెంచి పెద్ద చేసిన కొడుకే ఆ మాతృమూర్తి ఆయువును తీశాడు. కొడవలితో కసితీరా పదిసార్లకు పైగా దాడి చేస్తూ నడిరోడ్డుపై రాక్షసుడిగా మారాడు. ఈ ఘటన సభ్యసమాజానికి భయాందోళన కలిగిస్తున్నది. సమస్య ఏదైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు.. కన్నతల్లిని చంపాల్సినంత పగ ఏ ఒక్క కన్న కొడుకులోనూ ఉండొద్దని సభ్యసమాజం వేడుకుంటున్నది.
Eluru: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకున్నది. కొయ్యలగూడెం గ్రామంలోని అశోక్‌నగర్ ప్రాంతంలో జక్కుల నర్సమ్మ కూరగాయలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నది. ఆమె కొడుకు జక్కుల శివ జులాయిగా తిరుగుతూ అడ్డగోలుగా అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చాలని తన తల్లి నర్సమ్మను వేధించేవాడు.
Eluru: ఈ క్రమంలో మాట్లాడాలని చెప్పి కూరగాయల దుకాణం వద్ద ఉన్న నర్సమ్మను కొడుకు శివ ఇంటికి పిలిపించాడు. తనకొడుకు పిలిచాడు కదా, ఎంతైనా పేగుబంధం కదా, కన్నప్రేమ కదా, తల్లడిల్లి కొడుకు చెంతకు దారిపట్టింది. రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న నర్సమ్మను ఎదురుగా వచ్చిన శివ నడిరోడ్డుపైనే కొడవలితో విచక్షణారహితంగా దాడికి దిగాడు.
Eluru: నర్సమ్మ కొడుకు దాడితో నేలపై పడి విలవిలా కొట్టుకుంటున్నా.. సహనం కోల్పోయిన దుండగుడు కొడవలితో దాడి చేస్తూనే ఉన్నాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నర్సమ్మను స్థానికులు గమనించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నర్సమ్మ కన్నుమూసింది. కానీ, కన్నతల్లిని దుర్మార్గంగా హతమార్చిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చట్టాలు తేవాలని స్థానికులు కోరుతున్నారు.


