Elon musk: ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మళ్లీ తన విశాల ఆశయాన్ని పునరుద్ఘాటించారు – అంగారక గ్రహంపై మానవుల కోసం ఒక స్వయం సమృద్ధి కలిగిన నివాసాన్ని స్థాపించడం. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన, ఈ గమ్యాన్ని సాధించేందుకు ‘ఆక్యుపై మార్స్ మిషన్’ పేరుతో స్పేస్‌ఎక్స్ చేపడుతున్న మిషన్ కీలకమని వివరించారు.
“అంగారకుడిని కేవలం సందర్శించడం మా ఉద్దేశం కాదు. మానవాళిని బహుళ గ్రహ జాతిగా మారుస్తూ భవిష్యత్‌లో ఏదైనా విపత్తు సంభవించినా మన నాగరికత కొనసాగేలా చూడాలన్నదే మా లక్ష్యం,” అని మస్క్ తెలిపారు. సుదూర భవిష్యత్తులో సూర్యుడు విస్తరిస్తూ భూమిని నివాసయోగ్యం కాని స్థితికి తీసుకెళ్తాడని, అప్పుడు అంగారకుడు మానవాళికి ‘జీవ బీమా’గా నిలుస్తాడని ఆయన అభిప్రాయపడ్డారు.
సుమారు 440 మిలియన్ సంవత్సరాల తర్వాత సూర్యుడి వేడి వల్ల భూమిపై జీవం కొనసాగలేనని, అందుకే ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ నివాసాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ముందుగా 2026 నాటికి మానవరహిత వ్యోమనౌకను అంగారకుడిపై దించాలని, ఆ తర్వాత 2030 లోపు మానవులను పంపాలని మస్క్ పేర్కొన్నప్పటికీ, తాజాగా ఈ గడువును ముందుకు చుట్టారు. 2029 నాటికే మానవులు అంగారకుడిపై అడుగుపెట్టే అవకాశముందని చెప్పారు.
ప్రస్తుతం స్పేస్‌ఎక్స్ సంస్థ, స్టార్‌షిప్ వ్యోమనౌకను విజయవంతంగా కక్ష్యలోకి పంపడం, దాని పునర్వినియోగ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టిసారించింది. ఈ ప్రయాణం పూర్తయితే, మానవ చరిత్రలో ఇది ఒక విప్లవాత్మక ఘట్టంగా నిలిచే అవకాశం ఉందని మస్క్ ధీమా వ్యక్తం చేశారు.