Anil Ambani: బ్యాంకు రుణాల మోసం కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్ల మేరకు అనిల్ అంబానీ ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. సమన్లు జారీ చేయడానికి ముందు, ఈడీ అధికారులు జూలై 24 నుంచి అనిల్ అంబానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న సుమారు 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 50 కంపెనీలు, 25 మంది వ్యక్తులపై దర్యాప్తు జరిగింది. గతంలో, యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కేసులో అనిల్ అంబానీని ఈడీ విచారించింది. అయితే ఈసారి ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా కనిపిస్తున్నాయి. ఈడీ అధికారులు అనిల్ అంబానీ స్టేట్‌మెంట్‌ను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద రికార్డ్ చేయనున్నారు. ఈ విచారణ తర్వాత ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: US Tariffs Effect: ట్రంప్ సుంకాలతో లక్ష ఉద్యోగాలు పోతాయా?
ముఖ్యంగా యెస్ బ్యాంక్ కేసులో ఈడీ దర్యాప్తు ప్రధానాంశంగా ఉంది. యెస్ బ్యాంక్ నుంచి సుమారు ₹3,000 కోట్లు అక్రమంగా రుణాలు తీసుకుని దారి మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ రుణాల మంజూరులో అక్రమాలు జరిగాయని, వాటిని షెల్ కంపెనీలకు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఇచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ దాదాపు ₹10,000 కోట్లు దారి మళ్లించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధులు ‘CLE ప్రైవేట్ లిమిటెడ్’ అనే undisclosed related party కంపెనీ ద్వారా మళ్లించబడ్డాయని సెబీ పేర్కొంది. ఈ విషయంలో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దాఖలు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ విచారణ చేపట్టింది.