ED: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కారణంగా చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు కోల్పోయి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ కేసుల దర్యాప్తును ముమ్మరం చేసింది.
గూగుల్, మెటాకు ఈడీ నోటీసులు
ఈడీ తాజాగా టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాకు నోటీసులు జారీ చేసింది. వీరు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను తమ ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ప్రకటనల కోసం ప్రత్యేక స్లాట్లు ఇచ్చి, వెబ్‌సైట్‌ల లింకులు కూడా అందుబాటులో ఉంచినట్లు ఈడీ తెలిపింది. జూలై 21న గూగుల్, మెటా ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
సినీ ప్రముఖులు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై దర్యాప్తు
అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్‌కు చెందిన 29 మంది సినీనటులపై ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది. ఇందులో ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ వంటి వారి పేర్లు ఉన్నట్లు సమాచారం. వీరికి యాప్‌ల ప్రమోషన్ కోసం భారీ మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: TTD: టీటీడీ సంచలన నిర్ణయం: నలుగురు అన్యమత ఉద్యోగుల సస్పెన్షన్
మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ ప్రభావం
దేశవ్యాప్తంగా మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌తో సహా పలు పెద్ద కుంభకోణాలు బయటపడ్డాయి. ఈ కేసులో ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలను కూడా విచారించారు. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భఘేల్‌పై కూడా ఆరోపణలు ఉన్నాయి.
నల్లధనం, హవాలా లావాదేవీలు
ఈ యాప్‌ల ద్వారా కోట్ల రూపాయల నల్లధనం సంపాదిస్తున్నారని, హవాలా మార్గాల్లో డబ్బులు తరలిస్తున్నారని ఈడీ ఆరోపించింది. ఎక్కువ శాతం యాప్‌లు తమను ‘స్కిల్ బేస్డ్ గేమ్స్’ అని చెప్పుకుంటూ అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి.
ప్రజలకు హెచ్చరిక
ఈడీ ఈ దర్యాప్తు కారణంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల నెట్‌వర్క్ నెమ్మదిగా బయటపడుతోంది. ఈ యాప్‌లలో డబ్బులు పెట్టి మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయి. ప్రజలు ఇలాంటి యాప్‌లకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

