Pinarayi Vijayan: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఊహించని షాక్ తగిలింది. సంచలనం సృష్టించిన కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్ (KIIFB) మసాలా బాండ్ల జారీ కేసులో ఫెమా (విదేశీ మారకపు నిర్వహణ చట్టం) ఉల్లంఘనల ఆరోపణలపై సోమవారం ఈడీ ముఖ్యమంత్రికి, ఆయన వ్యక్తిగత కార్యదర్శికి, అలాగే మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుమారు ₹468 కోట్ల విలువైన లావాదేవీలకు సంబంధించిన ఈ నోటీసులు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
అసలేంటీ మసాలా బాండ్ల కేసు?
2019లో, రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులను సమీకరించే బృహత్ ప్రణాళికలో భాగంగా కేరళ ప్రభుత్వం KIIFB ద్వారా మసాలా బాండ్లను జారీ చేసింది. స్థానిక కరెన్సీలో కాకుండా, భారతీయ కరెన్సీ (రూపాయి)లోనే విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించడానికి ఈ ‘మసాలా బాండ్లను’ జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం కేరళే. KIIFB ఈ బాండ్ల ద్వారా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దాదాపు ₹2,000 కోట్లు సేకరించింది. ఈ బాండ్‌లు లండన్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ కావడం ద్వారా, ఆ మొత్తం విలువ ₹2,150 కోట్లకు పెరిగింది.
ఇది కూడా చదవండి: Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు.. తులం ఎంతంటే?
రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ₹50 వేల కోట్ల నిధులను సమీకరించాలనే పినరయి విజయన్ ప్రభుత్వ లక్ష్యంలో ఇది కీలక అడుగు. అయితే, ఈ నిధుల సేకరణ, వినియోగం విషయంలో ఫెమా మార్గదర్శకాలను ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈడీ దర్యాప్తు, ఆరోపణలు
KIIFB సేకరించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారని, ఫోరెక్స్ లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈడీ దర్యాప్తులో.. మసాలా బాండ్‌ల జారీలో ఫెమా చట్టాన్ని ఉల్లంఘించారని అధికారులు తేల్చారు. ఈ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పుడు సీఎం విజయన్, మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, సీఎం ప్రధాన కార్యదర్శి కేఎం అబ్రహంలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఈ షోకాజ్ నోటీసుల ద్వారా అధికారులు దర్యాప్తును ముగించారు. దీనిపై విచారణ అనంతరం, తేలిన ఉల్లంఘనల తీవ్రతను బట్టి భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే, ఈ నోటీసుల కింద ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. కేరళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నోటీసులపై ఎలా స్పందిస్తుందో, దీనిపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

