ED: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చకు దారితీసిన నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేస్తూ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద చేపట్టిన లోతైన దర్యాప్తులో ఆయన పాత్రకు సంబంధించి ఎటువంటి సాక్ష్యాలు లభించలేదని ఈడీ అధికారికంగా వెల్లడించింది.
చార్జిషీట్‌లో పేరు మినహాయింపు
విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ (సప్లిమెంటరీ) చార్జిషీట్‌ను జనవరి 28న న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ నివేదికలో ప్రాజెక్టు నిధుల మళ్లింపు లేదా ఇతర ఆర్థిక అక్రమాలతో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ వివరించింది. డిజైన్‌టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సీమెన్స్ ఇండియా మాజీ ప్రతినిధులను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నప్పటికీ, చంద్రబాబు పేరును మాత్రం ఈ జాబితా నుండి పూర్తిగా మినహాయించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రూ. 54.74 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ, మిగిలిన నిందితులపై విచారణ కొనసాగిస్తోంది.
Also Read: Dalai Lama: 90 ఏళ్ల వయసులో ‘గ్రామీ’ గెలిచిన దలైలామా
గతంలో సీఐడీ క్లోజర్ రిపోర్ట్
గత ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంతో ఆయన 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, గతేడాది డిసెంబర్ 12న ఏపీ సీఐడీ విజయవాడలోని ఏసీబీ కోర్టులో “మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్” (వాస్తవ దోషం) పేరుతో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసింది. అంటే, చంద్రబాబుపై మోపిన అభియోగాలు నిలబడతాయనడానికి ఆధారాలు లేవని సీఐడీ స్వయంగా అంగీకరించింది. దీనిని కోర్టు ఆమోదించడంతో అప్పట్లోనే ఆయనకు ఊరట లభించగా, ఇప్పుడు కేంద్ర సంస్థ అయిన ఈడీ కూడా అదే విషయాన్ని ధృవీకరించడం విశేషం.
ఈ పరిణామంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ, ఇది చంద్రబాబు నిష్కళంక రాజకీయ జీవితానికి లభించిన నైతిక విజయం అని కొనియాడారు. రాజకీయ కక్షసాధింపుతోనే ఆయనపై తప్పుడు కేసులు పెట్టారని, సత్యమే గెలిచిందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. సీఐడీ, ఈడీ రెండు సంస్థలు కూడా చంద్రబాబు పాత్ర లేదని తేల్చడంతో, ఈ సంచలన కేసు దాదాపు ముగిసినట్లేనని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.
