ED: బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసును పురోగతిలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేలా నోటీసుల్లో స్పష్టమైన తేదీలను కూడా పేర్కొంది.
ఈడీ నోటీసుల ప్రకారం:
జులై 23న రానా దగ్గుబాటి
జులై 30న ప్రకాశ్ రాజ్
ఆగస్టు 6న విజయ్ దేవరకొండ
ఆగస్టు 13న మంచు లక్ష్మి
వారు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.
ఈడీ ఇప్పటివరకు పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖపట్నం పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేశారు.
జంగిల్ రమ్మీ, జీత్‌విన్, లోటస్ 365 వంటి బెట్టింగ్ యాప్‌లకు ఈ ప్రముఖులు ప్రచారం చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ యాప్‌ల ప్రభావంతో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయినట్టు, కొందరు యువకులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ద్వారా నిర్వాహకులు కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది.