Earthquake: రష్యా తీర ప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 7.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. పసిఫిక్ మహాసముద్రంలో, పెట్రోపవ్‌లావ్‌స్కీ-కామ్చాట్కా నగరానికి సుమారు 144 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
ఈ ఘటనకు కొద్దిసేపటి ముందు అదే ప్రాంతంలో ఒక గంట వ్యవధిలో ఐదు చిన్న భూకంపాలు నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
తీవ్రత అధికంగా ఉండటంతో, సునామీ వచ్చే ప్రమాదం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. దీంతో కమ్చట్కా ద్వీపకల్పంలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది.
ప్రస్తుతం వరకూ ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం గురించి ఎలాంటి సమాచారం అందలేదు. అయితే భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచిస్తున్నారు. సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

