Earth: భూమి, నక్షత్రాలు, విశ్వం పుట్టుక, మార్పులు, చేర్పులు, అంతం అన్న అంశాలపై ఖగోళ శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తరాలు మారినా, ప్రపంచ గతి ఎటు వెళ్లినా ఆ పరిశోధనలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికీ విశ్వాంతరాల్లోకి మానవులు వెళ్లొచ్చి ఎన్నో వింతలు, విశేషాలను మన ముందుంచారు. చంద్రుడు, అంగారకుడు, ఇతర గ్రహాల్లోకి వెళ్లి అక్కడి విశేషాలను భూమి మీదికి పట్టుకొచ్చారు. తాజాగా ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధన మానవాళికి హెచ్చరికగా భావించాల్సి వస్తున్నది.
Earth: అదేమిటంటే.. ఎవరైనా ఓ వాహనంపై అతివేగంతో రోడ్డుపై వెళ్తున్నారనుకోండి. అది రెప్పపాటులో ఆగిపోతే ఏం జరుగుతుంది? భారీ ప్రమాదం చోటుచేసుకుంటుంది. ప్రాణాపాయమూ తప్పకపోవచ్చు. ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పిన విషయం కూడా ఇలాగే గోచరిస్తున్నది. భూమిని అన్వయించుకుని ఆలోచిస్తే ఇలాంటిదే జరిగితే భూగోళంపై ఉన్న మానవాళికే కాదు, జంతుజాలాలు కూడా నాశనం కాక తప్పదని ఆ హెచ్చరిక సారాంశం.
Earth: మన విశ్వంలో జీవజాలానికి భూమి అనువైన ఏకైక గ్రహం అన్నమాట. ఈ భూమి 23.5 డిగ్రీలు ఒకవైపు వంగి తన అక్షం చుట్టూ తిరుగుతూ, గంటకు దాదాపు 1,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది. ఒకవేళ అదే భూమి ఒక్కసెకను పాటు ఆగిపోతే, దానిపై ఉన్న ప్రతీది తూర్పు వైపు విసిరేయబడతాయి. వాతావరణం, మహాసముద్రాలు విధ్వంసానికి గురవుతాయి.
Earth: భూమి ఒక్క సెకనుపాటు ఆగితే భారీ భూకంపాలు, సునామీలు సంభవిస్తాయని ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీత్ డిగ్రాస్సే టైసన్ చెప్పారు. ఇది భూమిపై ఉన్న ప్రతి ఒక్కరినీ చంపేస్తుందని ఆయన హెచ్చరించారు. భూమిపై జీవరాశులన్నీ నశించిపోతాయన్న మాట. ఇలా ఎప్పుడు జరుగుతుంది, ఒకవేళ ఇలా జరుగుతుందా? అని మాత్రం వారు వెల్లడించలేదు. కానీ, ఒకవేళ విశ్వ పరిణామాల్లో కనుక ఇదే జరిగితే ప్రపంచం అంతమవుతుందని మాత్రం నమ్మవచ్చు.