Gas Cylinder: వంట గ్యాస్ వాడుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా e-KYC (ఈ-కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అర్హులైన వారికే సబ్సిడీ అందేలా చూడటం, చనిపోయిన వారి పేరు మీద ఉన్న కనెక్షన్ల ద్వారా జరుగుతున్న అక్రమాలను అరికట్టడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. వినియోగదారులు కంగారు పడకుండా తమ ఇంట్లోనే ఉండి స్మార్ట్ ఫోన్ ద్వారా కేవలం నిమిషాల్లోనే ఆధార్ కార్డుతో ఈ-కేవైసీని పూర్తి చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల కోసం ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్ https://pmuy.gov.in/e-kyc.html ను సందర్శించవచ్చు.
మరోవైపు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గ్యాస్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా ఇంధన ధరలు భారీగా పెరగడంతో, దేశీయంగా 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరపై 60 రూపాయలు పెంచారు. గడిచిన 11 నెలల్లో గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. తాజా పెంపుతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 913కు చేరుకుంది. అయితే ఉజ్వల పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే రూ. 300 సబ్సిడీ పోను, వారు సిలిండర్‌కు రూ. 613 చెల్లించాల్సి ఉంటుంది.
వాణిజ్య అవసరాల కోసం వాడే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. ఒక్కసారిగా రూ. 114.50 పెరగడంతో, దీని ధర రూ. 1,883కు చేరింది. ఈ ఒక్క ఏడాదిలోనే కమర్షియల్ గ్యాస్ ధర ఏకంగా రూ. 302 పెరగడం గమనార్హం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల వల్ల చమురు రవాణా జరిగే హోర్మూజ్ జలసంధి గుండా రాకపోకలు నిలిచిపోవడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం.
భారత్ దిగుమతి చేసుకునే గ్యాస్‌లో దాదాపు 90 శాతం ఇదే మార్గం ద్వారా వస్తుంది. ప్రస్తుతం ఖతర్ నుండి సరఫరా నిలిచిపోవడంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. అత్యవసర అధికారాలను ఉపయోగించి దేశీయ రిఫైనరీలలో గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
