DSC-2008: ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న డీఎస్సీ 2008 అభ్యర్థులకు హైకోర్టు ఆదేశాలు ఒక శుభవార్తే అని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వాల మాదిరిగానే, ఎన్నికల్లో హామీ ఇచ్చి ఏడాదిగా ఊరిస్తూ వస్తున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కూడా నియామకాలపై జాప్యం చేస్తూ వస్తున్నది. ఈ దశలో తాజాగా జరిగిన విచారణలో హైకోర్టు ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతుంది. నియామకాలపై వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి.
హైకోర్టు ఏమన్నదంటే?
DSC-2008: డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగాలు ఇవ్వాలన్న తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2008లో పరీక్షలు రాసిన అభ్యర్థులు ఇంకెంతకాలం ఉద్యోగాల కోసం ఎదురుచూడాలని న్యాయస్థానం ప్రశ్నించింది. తమ ఉత్తర్వులు అమలు చేయకుంటే అధికారులకు వ్యతిరేకంగా ప్రతికూల ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నది. వెంటనే అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఉత్తర్వులు ఇవ్వండి అంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
DSC-2008: ఈ నెల 3న రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంపైనా హైకోర్టు సీరియస్ అయింది. ఈ నెల 17లోపు 1382 మంది డీఎస్సీ-2008 అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రతిగా నియామక ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. అయినా సంతృప్తి చెందని హైకోర్టు విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
DSC-2008: దీంతో డీఎస్సీ 2008 అభ్యర్థులు సంతోషంతో ఉన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమకు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇస్తుందని ఆశతో ఉన్నారు. అది కూడా ఇదే నెలలో జరుగుతుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ తాత్సారం చేస్తూ వస్తున్నదని, దీంతోనే హైకోర్టు మొట్టికాయలు వేసిందని విద్యావేత్తలు అంటున్నారు. అయితే ఎన్నికల వేళ నియామక ప్రక్రియ జరుగుతుందా? లేదా? అన్న సంశయం వారిలో నెలకొన్నది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, త్వరలో స్థానిక ఎన్నికల కోడ్ వచ్చే అవకశం ఉన్నది.