Tirupati

Tirupati: తిరుపతిలో గుడి గోపురం ఎక్కి.. మందుబాబు హల్చల్!

Tirupati: తిరుపతిలోని చారిత్రక శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఒక వ్యక్తి మద్యం మత్తులో చేసిన హంగామా భక్తులను, ఆలయ సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఆలయంలో రాత్రి వేళ ఏకాంత సేవ ముగిసి తలుపులు మూసివేసిన తర్వాత, భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించి ఏకంగా గోపురంపైకి ఎక్కడం కలకలం రేపింది. మద్యం మత్తులో ఊగుతున్న ఆ వ్యక్తి గోపురంపై ఉన్న కలశాలను లాగేందుకు ప్రయత్నించడమే కాకుండా, అక్కడి విద్యుత్ దీపాలను కూడా స్వల్పంగా ధ్వంసం చేశాడు.

ఈ విషయాన్ని గమనించిన ఆలయ విజిలెన్స్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని అతడిని కిందికి దింపేందుకు ప్రయత్నించగా, ఆ వ్యక్తి పెట్టిన విచిత్రమైన షరతు అందరినీ విస్తుపోయేలా చేసింది. తనకు ఒక క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తేనే కిందికి దిగుతానంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ హైడ్రామాలో, పోలీసులు నిచ్చెనలు, తాళ్ల సాయంతో గోపురంపైకి ఎక్కి ఎట్టకేలకు అతడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

Also Read: Viral News: తలుపున‌కు అడ్డంపెట్టిన ఆ రాయి కోట్ల విలువ ఉంటుంద‌ని ఆమెకు తెలియ‌లేదు!

పోలీసుల విచారణలో నిందితుడిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మవాడకు చెందిన కుత్తడి తిరుపతి (45) గా గుర్తించారు. నిందితుడు తిరుపతిలో నివాసం ఉంటూ భార్యతో కలిసి కూలి పనులు చేసుకుంటున్నాడని, అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. మద్యం మత్తులోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ, అతడికి మతిస్థిమితం సరిగా లేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, పవిత్రమైన ఆలయంలో భద్రతా వైఫల్యాలు ఎలా జరిగాయనే కోణంలో ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *