Dream11: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), డ్రీమ్11 మధ్య ఉన్న స్పాన్సర్‌షిప్ ఒప్పందం ముగిసింది. ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధిస్తూ పార్లమెంటు ఆమోదించిన కొత్త చట్టం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
తాజాగా పార్లమెంటులో “ప్రొమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్ – 2025” అనే బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం, డబ్బుతో కూడిన ఆన్‌లైన్ గేమ్‌లకు సంబంధించిన ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు పూర్తిగా నిషేధించబడ్డాయి. డ్రీమ్11 ప్రధానంగా ఫాంటసీ గేమింగ్ సంస్థ కావడంతో, ఈ కొత్త చట్టం ప్రకారం వారు స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది.
అవును. డ్రీమ్11 ప్రతినిధులు స్వయంగా బీసీసీఐ కార్యాలయానికి వెళ్లి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. బైజూస్ తర్వాత 2023లో డ్రీమ్11 రూ.358 కోట్లతో మూడేళ్ల కాలానికి భారత జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఒప్పందం చేసుకుంది. అయితే, ఒప్పందంలో ఒక నిబంధన ప్రకారం, చట్టపరమైన కారణాల వల్ల స్పాన్సర్‌షిప్ రద్దయితే జరిమానా ఉండదు. ఈ కారణంగానే డ్రీమ్11పై బీసీసీఐ ఎలాంటి పెనాల్టీ విధించలేదు.
Also Read: Cheteshwar Pujara: ఛెతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌కు ముందు కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ వేట మొదలుపెట్టింది. త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే డ్రీమ్11 లోగోతో సిద్ధమైన జెర్సీలను ఇకపై ఉపయోగించబోమని కూడా బీసీసీఐ స్పష్టం చేసింది.
డ్రీమ్11 కేవలం భారత జట్టుకే కాకుండా, పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా స్పాన్సర్‌గా ఉంది. కొత్త చట్టం ప్రభావం ఈ ఒప్పందాలపైనా పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ వంటి పలువురు ప్రముఖ క్రికెటర్లు డ్రీమ్11కు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఒప్పందాలు కూడా కొనసాగించడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ పరిణామాల మధ్య డ్రీమ్11 మాతృ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్, ఆర్థిక సేవల రంగంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. దీని కోసం ‘డ్రీమ్ మనీ’ అనే కొత్త యాప్‌ను ప్రయోగాత్మకంగా విడుదల చేసినట్లు సమాచారం. ఇది బంగారు కొనుగోలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలను అందించనుంది. ఇది వారి వ్యాపార విధానంలో ఒక కొత్త మార్పుగా చూడవచ్చు.
