Curry Leaves: భారతీయ వంటకాల్లో కేవలం రుచిని, సువాసనను పెంచేందుకే కాకుండా, ప్రాణాంతక వ్యాధులను నయం చేసే దివ్యౌషధంగా కరివేపాకు నిలుస్తోంది. తరతరాలుగా మన వంటిళ్లలో పోపు డబ్బాలో భాగమైన కరివేపాకు సాధారణంగా మనం భోజనం చేసేటప్పుడు ఏరి పక్కన పడేసే ఈ చిన్న ఆకుల్లో క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకునే శక్తి ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కరివేపాకులో లభించే ఫ్లేవనాయిడ్లు, గ్యాలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు కొలోన్, బ్రెస్ట్ క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. కేవలం వ్యాధి నిరోధకతకే కాకుండా, జీర్ణ ప్రక్రియలో తలెత్తే సమస్యలను పరిష్కరించడంలో ఇది మేటిగా పనిచేస్తుంది. ఇందులోని ‘గిరినింబైన్’ అనే సమ్మేళనం కడుపు పూతలను తగ్గించి, ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అలాగే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలడం వల్ల శరీర మెటబాలిజం పెరిగి బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.
Also Read: Raw vs Cooked Vegetables: వండకుండా పచ్చిగా తింటేనే ఆరోగ్యం.. ఆ 4 కూరగాయల రహస్యమిదే!
డయాబెటిస్‌తో బాధపడేవారికి కరివేపాకు ఒక వరప్రసాదం లాంటిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడమే కాకుండా, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి సంబంధించి కూడా కరివేపాకు అద్భుతాలు చేస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను దాదాపు 12 శాతం వరకు తగ్గించి, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
కేవలం శారీరక ఆరోగ్యమే కాకుండా, మానసిక ఉల్లాసానికి కూడా ఇది తోడ్పడుతుంది. కరివేపాకు వాసన పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్యలు, గర్భిణుల్లో కలిగే వికారం వంటి ఇబ్బందులను ఇది తగ్గిస్తుంది. ఇక జుట్టు ఆరోగ్యానికి కరివేపాకు చేసే మేలు అందరికీ తెలిసిందే. ఇందులోని అమైనో ఆమ్లాలు, విటమిన్లు జుట్టు కుదుళ్లను దృఢపరిచి అకాల తెల్ల జుట్టును నివారిస్తాయి. విటమిన్-ఎ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడటమే కాకుండా రేచీకటి వంటి సమస్యలు దరిచేరవు. క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాల గని అయిన కరివేపాకును ఇకపై వంటల్లో ఏరి పక్కన పడేయకుండా ఆహారంతో పాటు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

