Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ వస్తువులపై భారీ సుంకాలు విధిస్తూ దేశీయ పరిశ్రమలకు రక్షణ కల్పించాలని భావించారు. కానీ ఈ నిర్ణయం అతనికి తిప్పలు తెచ్చిపెట్టినట్లు కనిపిస్తోంది. సుంకాల ప్రకటనల తర్వాత అమెరికా కంపెనీల దివాలాలు గణనీయంగా పెరిగాయి.
2025లో రికార్డు స్థాయి దివాలాలు
ఈ సంవత్సరం ఇప్పటివరకు 446 ప్రధాన అమెరికా కంపెనీలు దివాలా తీశాయి, ఇది 2020 మహమ్మారి సంవత్సరంతో పోలిస్తే 12% ఎక్కువ. ముఖ్యంగా జూలై నెలలోనే 71 కంపెనీలు దివాలా దాఖలు చేయడం 2020 తర్వాత అత్యధికం.
ఏప్రిల్‌లో ట్రంప్ విదేశీ వస్తువులపై 10% సుంకం విధించారు. ఆశ్చర్యకరంగా అదే నెల నుండి కంపెనీలు పెద్ద సంఖ్యలో దివాలాలు దాఖలు చేయడం మొదలైంది. మొదటి ఆరు నెలల్లోనే 371 కంపెనీలు దివాలా తీశాయి, జూన్‌లో ఒక్క నెలలోనే 63 కంపెనీలు కోర్టు తలుపులు తట్టాయి. ఈ జాబితాలో ఫరెవర్ 21, జోన్స్, రైట్ ఎయిడ్, పార్టీ సిటీ, క్లైర్స్ వంటి ప్రముఖ బ్రాండ్లు కూడా ఉండటం ప్రత్యేకం.
90 ఏళ్లలో అత్యధిక సుంకాలు
ప్రస్తుతం అమలులో ఉన్న అమెరికా సుంకాలు 17.3% వద్ద ఉన్నాయి. ఇది 1935 తర్వాత అత్యధిక స్థాయి. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో 41% చిన్న కంపెనీలు నష్టాల్లోకి వెళ్లగా, 2024 చివరి నాటికి రస్సెల్ 2000లో 43% కంపెనీలు నష్టాలు చవిచూశాయి.
ఏ ఏ రంగాలు దెబ్బతిన్నాయి?
-
ఇండస్ట్రియల్స్ – 70 కంపెనీలు
-
కన్స్యూమర్ డిస్క్రిషనరీ – 61
-
హెల్త్‌కేర్ – 32
-
కన్స్యూమర్ స్టేపుల్స్ – 22
-
ఐటీ – 21
-
ఫైనాన్స్ – 13
-
రియల్ ఎస్టేట్ & కమ్యూనికేషన్స్ – 11
-
మెటీరియల్స్ – 7
-
యుటిలిటీస్, ఎనర్జీ – 4
ఇవన్నీ చూసినప్పుడు దాదాపు ప్రతి రంగం సుంకాల ప్రభావంతో కుదేలైందని స్పష్టమవుతోంది.
నిరుద్యోగం – ద్రవ్యోల్బణం పెరుగుదల
సుంకాల వల్ల ఉత్పత్తి ఖర్చులు పెరగడం, వినియోగదారుల డిమాండ్ తగ్గిపోవడం చోటు చేసుకుంది. జూలైలోనే 11% చిన్న వ్యాపారాలు విక్రయాలు బలహీనంగా ఉన్నాయని నివేదించాయి. చిన్న వ్యాపారాలు అమెరికాలో 62.3 మిలియన్ల మందికి ఉపాధి ఇస్తున్నాయి, అంటే మొత్తం శ్రామిక శక్తిలో 45.9%.
అలాగే 20–24 ఏళ్ల యువతలో నిరుద్యోగం 8.1% వద్ద నమోదైంది. ఇది గత నాలుగేళ్లలో అత్యధికం, 2008 ఆర్థిక సంక్షోభ స్థాయికి చేరువైంది.

