Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల విదేశీ సంపన్నులకు “గోల్డ్ కార్డు” వీసా జారీ చేస్తామని ప్రకటించారు. ఈ స్కీమ్ ద్వారా 5 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టే విదేశీయులకు అమెరికాలో నివాసం, ఉద్యోగ అవకాశం లభించనుందని తెలిపారు. ఇప్పటివరకు అమలులో ఉన్న EB-5 ఇన్వెస్టర్ వీసా స్థానంలో కొత్త గోల్డ్ కార్డు విధానం త్వరలో అమల్లోకి రానుందని వెల్లడించారు. ఈ పథకం వల్ల భారీ పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు, దేశీయంగా వేలాది ఉద్యోగాలు సృష్టించగలమని ఆయన పేర్కొన్నారు.
అయితే, గ్రీన్ కార్డుదారుల శాశ్వత పౌరసత్వంపై అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. హెచ్-1బీ వీసా ద్వారా అమెరికా వెళ్లిన వారికి గ్రీన్ కార్డు ద్వారా పౌరసత్వం లభిస్తుంది. ఇది వారికి శాశ్వత నివాసం, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అయితే, “గ్రీన్ కార్డు ఉన్నవారికి అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కు ఉండదని” జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని, అమెరికాలో ఎవరు ఉండాలో నిర్ణయించే హక్కు ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం, క్రిమినల్ కేసులు, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన, అమెరికా నుంచి దీర్ఘకాలం దూరంగా ఉండటం వంటి పరిస్థితుల్లో గ్రీన్ కార్డును రద్దు చేయవచ్చు.
Also Read: Chiranjeevi: మెగాస్టార్‌కు జీవిత సాఫల్య పురస్కారం – మరో ఘనత!
Donald Trump: ఇదే సమయంలో, ప్రస్తుతం అమలులో ఉన్న వలస విధానం అంతర్జాతీయ ప్రతిభావంతులను నిరుత్సాహపరుస్తోందని ట్రంప్ ఆరోపించారు. ముఖ్యంగా భారత్, చైనా, జపాన్ నుంచి వచ్చిన విద్యార్థులు హార్వర్డ్, వార్టన్ వంటి విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను పూర్తిచేసిన తర్వాత, వారికి అమెరికాలో స్థిరపడేందుకు సరైన అవకాశాలు లభించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వారు కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు పొందినా, వీసా అనిశ్చితి కారణంగా అవి రద్దవుతున్నాయని తెలిపారు.
అమెరికా కాంగ్రెస్ 1990లో ప్రవేశపెట్టిన EB-5 వీసా ప్రోగ్రామ్ కింద, కనీసం $1 మిలియన్ (సుమారు రూ. 9 కోట్లు) పెట్టుబడి పెట్టి, 10 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విదేశీయులకు వీసాలను మంజూరు చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ గోల్డ్ కార్డు పథకం ద్వారా మరింత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త వలస విధానాలు, ముఖ్యంగా గ్రీన్ కార్డుపై జేడీ వాన్స్ వ్యాఖ్యలు, అమెరికాలో వలసదారుల భవిష్యత్తుపై కొత్త చర్చకు దారి తీశాయి.