Donald Trump: భారత్, రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తుందని, ఈ మేరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను భారత్‌లోని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఖండించింది. తాజాగా, వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును క్రమంగా తగ్గిస్తుందని, “సంవత్సరం చివరి నాటికి ఇది దాదాపు సున్నాకి చేరుకుంటుంది” అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని, ఇది ఒక పెద్ద ముందడుగు అని ఆయన ప్రశంసించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని నిధులు సమకూర్చకుండా నిరోధించే అమెరికా ప్రయత్నాలలో ఇది కీలకమని ట్రంప్ అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడి ప్రకటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టత ఇచ్చింది.
Also Read: Party Defections Case: తుది దశకు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ.. ఆ రోజు నుంచే మళ్లీ విచారణ
అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో, భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రధానమని MEA అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. స్థిరమైన ఇంధన ధరలు, సురక్షితమైన సరఫరా అనే రెండు లక్ష్యాల ఆధారంగానే తమ ఇంధన దిగుమతి విధానాలు ఉంటాయని, ఇందులో తమ వనరులను విస్తరించుకోవడం కూడా ఒక భాగమని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య అలాంటి సంభాషణ జరగలేదని గతంలో విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, రాయితీ ధరలకు లభిస్తున్న రష్యా చమురును భారత్ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. దీంతో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. ఈ కొనుగోళ్లపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, భారత్‌పై అదనపు సుంకాలను కూడా విధించింది. అయితే, తమ ఇంధన అవసరాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటామని భారత్ మొదటి నుంచి గట్టిగా చెబుతోంది. ట్రంప్ పదేపదే ఈ ప్రకటన చేయడం, దానికి భారత ప్రభుత్వం స్పందించకపోవడంపై ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పించాయి. అయితే, భారత్ అధికారికంగా రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని ఎటువంటి ప్రకటన చేయలేదు.