Shocking Incident: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధార్థ న్యూరో ఆస్పత్రిలో మరోసారి ఠాగూర్ సినిమాలోని సీన్ రిపీట్ అయింది. న్యూరో సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ చనిపోయి మూడు, నాలుగు రోజుల తర్వాత కూడా ట్రీట్మెంట్ చేసి లక్షల్లో బిల్లు కాజేసి చివరికి శవాన్ని అప్పగించారంటూ బాధితులు మదీనగూడ సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా నందునూరు గ్రామానికి చెందిన జి. సుహాసిని డిగ్రీ పూర్తిచేసుకుని ఇంటి దగ్గరే ఉండేది. అయితే గత నెల 10వ తేదీన ఆమె కళ్లు తిరిగి పడిపోయింది. వారి బంధువులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ సరైన వైద్యం అందడం లేదని, పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పడంతో వారు అక్కడి డాక్టర్ ను సంప్రదించగా చెన్నైకి కానీ లేదా హైదరాబాద్ కు కానీ తరలించాలని సూచించారు.
ఇది కూడా చదవండి: Couple Suicide: శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత దంపతుల ఆత్మహత్య
దాంతో మృతురాలిని నగరంలోని మియాపూర్ సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుండి సిద్దార్థ్ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇప్పటి వరకు ఆమెకు వైద్యానికి అయిన రూ.13 లక్షలను బాధితులు ఆస్పత్రికి చెల్లించారు.మరో రూ.5 లక్షలు కట్టాల్సి ఉంది. అయితే ఆస్పత్రి యాజమాన్యం మృతురాలి బంధువులకు కాల్ చేసి యువతి సీరియస్ గా ఉందని, డబ్బులు కట్టి వెంటనే ఇక్కడి నుండి తరలించాలని లేదంటే తామే మాస్క్ తీసేస్తామని హెచ్చరించారు. దీంతో భయపడిన బాధితులు యువతిని అంబులెన్స్ ద్వారా నిమ్స్ ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే అంబులెన్స్ లో పేషెంట్ ను తీసుకువెళ్తుండగా అందులో వెళ్తున్న ఆస్పత్రి అటెండర్ మధ్యలోనే వదిలేసి వెళ్లాడని, అక్కడ మరో వ్యక్తి తమతో పాటు నిమ్స్ ఆస్పత్రికి వచ్చాడని తెలిపారు.
ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ కు చూపించగా పేషెంట్ చనిపోయిందని అక్కడి డాక్టర్లు తెలిపారు. దీంతో మృతురాలి బంధువులు మృతదేహాన్ని తిరిగి మదీనగూడ సిద్దార్థ్ న్యూరో ఆసుపత్రికి తీసుకువచ్చి తమకు న్యాయం చేయాలంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇదే విషయం పై సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రి సీఈఓ డాక్టర్ వెంకటేష్ నాయుడును వివరణ కోరగా లీగల్ నోటీసు తీసుకుని వస్తే మాట్లాడుతా.. లేదంటే మాట్లాడను అంటూ మీడియా మీద చిందులు తొక్కారు. నా ప్రెమిసెస్ లోకి ఎందుకు వచ్చారు. మీకేం పని అంటూ దురుసుగా వ్యవహరించారు. సిద్దార్థ్ న్యూరో ఆస్పత్రి సిబ్బంది సైతం తమ పై భౌతిక దాడికి యత్నించారని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.