Gurugram: గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఒక స్విగ్గీ డెలివరీ బాయ్‌ను ఓ డాక్టర్ తన కారుతో పదే పదే ఢీకొట్టి చంపేందుకు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న డాక్టర్ నవీన్ యాదవ్, తన నల్లటి స్కార్పియో కారుతో హయత్ పూర్ సమీపంలో ఉన్న డెలివరీ ఏజెంట్ టింకు పన్వర్‌ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడు.
అసలు గొడవకు కారణం చాలా చిన్నది. అక్కడ స్విగ్గీ వేర్‌హౌస్ ఉండటంతో డెలివరీ బాయ్స్ తరచుగా రోడ్డుపైనే ఉంటుంటారు. దీనిపై కోపంతో ఉన్న డాక్టర్, మొదట మెల్లగా డెలివరీ ఏజెంట్‌ను ఢీకొట్టాడు. ఎందుకు ఇలా చేశావని ప్రశ్నించినందుకు కోపోద్రిక్తుడైన ఆ డాక్టర్, తన వాహనాన్ని పదే పదే ఆ వ్యక్తిపైకి దూసుకెళ్లించాడు. ప్రాణభయంతో సదరు ఏజెంట్ ఒక చెట్టు చాటుకు పారిపోయినా, వదలకుండా తన కారుతో వెంబడించి అక్కడ ఉన్న బైక్‌లను కూడా ధ్వంసం చేశాడు. ఈ భయానక దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
ఇది కూడా చదవండి: Cylinder Explosion: ఉత్సవంలో ఘోర ప్రమాదం.. సిలిండర్ పేలి నలుగురు మృతి..!
అక్కడే ఉన్న మిగిలిన డెలివరీ బాయ్స్ అడ్డుకోవాలని చూసినా, వారిపైకి కూడా కారును పోనిచ్చి భయభ్రాంతులకు గురిచేశాడు. అనంతరం అక్కడి నుండి పరారైన డాక్టర్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. నిందితుడు దౌలతాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం గాయపడిన టింకు పన్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
