Tea: చాయ్.. ఇది లేకపోతే చాలా మందికి రోజే స్టార్ట్ అవ్వదు. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి ఇది ఎంతో ఇష్టమైనది. కొంతమంది రోజుకు లెక్కలేనన్ని టీలు తాగుతారు. ఎందుకంటే ఇది ఒక రకమైన శక్తిని, తాజాదనాన్ని ఇస్తుందని చాలామంది నమ్ముతారు. అందుకే తలనొప్పి అయినా, ఆందోళన పెరిగినా ఏ సమస్యకైనా టీ కావాల్సిందే. కానీ మనం ప్రతిరోజూ తాగే టీలో కలిపే చక్కెర పరిమాణం ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి? ఆరోగ్య సమస్యలు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీరు ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే ఏమవుతుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టీ ప్రియులకు నెల రోజుల పాటు టీ తాగకుండా ఉండటం నిజంగా ఒక సవాలు. కానీ ఆరోగ్యం కోసం మనస్సును కంట్రోల్ చేసుకోక తప్పదు. మనం త్రాగే టీలో సాధారణంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కేలరీలు పెరుగుతాయి. అలాగే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, టీలోని చక్కెర జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఒక నెల పాటు స్వీట్ టీ తాగడం మానేస్తే జీర్ణక్రియ మెరుగుపడి, బరువు కూడా తగ్గుతారు. అంతేకాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టవు.
సాధారణంగా ఒక నెల పాటు స్వీట్ టీ తాగకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా తీపిగా ఉండే టీ తాగడం వల్ల చర్మంపై మొటిమలు వస్తాయి. కాబట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే,స్వీట్ టీ తాగకపోవడమే మంచిది.
ఒక నెల పాటు టీ తాగకపోవడం వల్ల శరీరంలో కెఫిన్ పరిమాణం తగ్గుతుంది. ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అదనంగా ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
నెల రోజుల పాటు స్వీట్ టీ తాగకపోతే డీహైడ్రేషన్ కు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఇది కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను కూడా తగ్గిస్తుంది.
టీ తాగే అలవాటు మానేయడం వల్ల గుండెల్లో మంట, తలతిరగడం, హృదయ స్పందన రేటులో హెచ్చుతగ్గులు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ చేతులు వణుకుతుంటే, టీ తాగడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. అంతేకాకుండా మీరు టీ తాగడం మానేస్తే, అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది.