Dk shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చిన్నస్వామి స్టేడియం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని నివేదికల్లో రాబోయే 2026 సీజన్‌లో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మ్యాచ్‌లు జరగకపోవచ్చని ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేఎస్‌సీఏ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శివకుమార్ ఈ విషయాన్ని క్లారిటీ చేశారు.
“చిన్నస్వామి స్టేడియం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలించడం అనేది కర్ణాటక ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి నిర్ణయాన్ని అంగీకరించం. నేను కూడా క్రికెట్ అభిమానిని. స్టేడియం ప్రతిష్ఠను కాపాడతాం. ఇకపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటాం” అని ఆయన ధృవీకరించారు. అదేవిధంగా బెంగళూరులో మరో ఆధునిక క్రికెట్ స్టేడియాన్ని నిర్మించే యోచనలో ఉన్నట్లు శివకుమార్ వెల్లడించారు.
గత సీజన్‌లో ఆర్‌సీబీ జట్టు టైటిల్ గెలుపు సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన విజయోత్సవాల్లో పెద్ద ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల ఐపీఎల్ మ్యాచ్‌లు వేరే వేదికలకు మార్చే అవకాశం ఉందనే వార్తలు బయటకి వచ్చాయి. అయితే ఈ రోజు శివకుమార్ చేసిన ప్రకటనతో ఈ ఊహాగానాలకు బ్రేక్ పడినట్లైంది.
ఇక మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు వచ్చిన సమాచారం కొత్త చర్చలకు దారితీసింది. యాజమాన్యం మారితే జట్టు హోం గ్రౌండ్‌పై ప్రభావం పడుతుందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ, శివకుమార్ వ్యాఖ్యలు ఆ భయాలను కూడా కొంతవరకు తొలగించినట్టుగానే కనిపిస్తున్నాయి.

