AP Govt Employees: ఏపీలో ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న ఓ ప్రకటన విడుదలకు రంగం సిద్దమవుతోంది. గతంలో కేబినెట్ భేటీ సందర్భంగా ఈ ప్రకటన వస్తుందని భావించినా చివరి నిమిషంలో వాయిదా పడిపోయింది.దీంతో దీపావళి కానుకగా రేపు ఈ ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఆర్థికశాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సీఎస్ విజయానంద్ తుది చర్చలు జరుపుతున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన చేయబోతున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా గత వైసీపీ సర్కార్ తరహాలోనే ఉద్యోగుల బకాయిలు అలాగే ఉన్నాయి. వీటితో పాటు పీఆర్సీ ప్రకటన, కమిషనర్ నియామకం, ఇతర ఆర్ధిక ప్రయోజనాలు, హెల్త్ కార్డుల వంటి అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై ఉద్యోగుల్లో అసంతృప్తి అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీటిలో కొన్ని అయినా దసరాకు ప్రకటించాలని ఉద్యోగులు కోరినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో అసంతృప్తి మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబు..
Also Read: Telangana Bandh: బీసీ రిజర్వేషన్ల కోసం: రాజకీయ పార్టీల మద్దతుతో కొనసాగుతున్న రాష్ట్ర బంద్
అమరావతి సచివాలయంలో సీఎస్ విజయానంద్, ఆర్థికశాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఉద్యోగులకు పెండింగ్ ఉన్న బకాయిలపై చర్చిస్తున్నారు. ఇప్పటివరకూ ఉద్యోగులకు 5 డీఏలు బకాయిలు ఉన్నట్లు తేల్చారు. వీటితో పాటు పీఆర్సీ ప్రకటన, అది కుదరకపోతే కనీసం ఐఆర్ ప్రకటన కచ్చితంగా చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వీటిపైనా ఆర్థికశాఖతో సీఎం చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే పెండింగ్ ఉన్న డీఏల్లో ఒకటి విడుదల చేయాలన్నా రూ.164 కోట్లు ఖర్చవుతుందని ఆర్ధికశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఒక డీఏ బకాయితో పాటు మరో అంశంపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటికి ఎంత ఖర్చవుతుందన్న దానిపై ఇవాళ క్లారిటీ వస్తే రేపు తుది అంచనాలు ఖరారు చేసి సీఎం చంద్రబాబుకు అధికారులు వివరాలు సమర్పిస్తారు. వీటి ఆధారంగా రేపు సాయంత్రానికి చంద్రబాబు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశముంది.