Womens Chess World Cup: భారత చెస్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది! యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌ను గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. సోమవారం జరిగిన తుది పోరులో భారత స్టార్ క్రీడాకారిణి కోనేరు హంపిపై దివ్య అద్భుత విజయం సాధించింది.
ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. మొదటి రెండు సాధారణ గేమ్స్ డ్రా అయ్యాయి. దీంతో విజేతను తేల్చడానికి టై-బ్రేకర్ అవసరమైంది. టై-బ్రేకర్ తొలి ర్యాపిడ్ గేమ్ కూడా డ్రాగా ముగియగా, ఆ తర్వాత రెండో గేమ్‌లో 75 ఎత్తుల్లో దివ్య తన అద్భుతమైన ఆటతీరుతో కోనేరు హంపిని ఓడించి విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇద్దరు భారతీయ క్రీడాకారిణులు ఫైనల్‌లో తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం.
Also Read: Shubman Gill: గిల్ సెంచరీతో రికార్డుల మోత!
ఈ విజయంతో 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ గ్రాండ్‌మాస్టర్ (GM) హోదాను అందుకుంది. భారతదేశం నుండి ఈ గౌరవం పొందిన 88వ గ్రాండ్‌మాస్టర్‌గా, నాల్గవ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా దివ్య నిలిచింది. మహారాష్ట్రకు చెందిన దివ్యకు ఈ విజయం ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొంది. “ఈ ఆనందాన్ని నమ్మడానికి నాకు కొంత సమయం పడుతుంది. గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ని ఈ విధంగా నేను పొందడం పూర్తిగా విధి అని భావిస్తున్నాను. ఈ టోర్నమెంట్‌కు ముందు నాకు ఎలాంటి ప్రమాణాలు లేవు. ఈ విజయం నాకు ఎంతో ముఖ్యమైనది. ఇంకా చాలా సాధించాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అని దివ్య తన ఆనందాన్ని పంచుకుంది.
దివ్య దేశ్‌ముఖ్ సెమీఫైనల్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ టాన్ ఝోంగీ (చైనా)ని ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఆమె తన చిన్న వయసులోనే అనేక అంతర్జాతీయ పోటీల్లో తన ప్రతిభను చాటుకుంది. 2020లో ఫిడే ఆన్‌లైన్ ఒలింపియాడ్‌లో భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. 2021లో ఆమె భారతదేశపు 21వ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌ను తొలిసారి భారత్ గెలుచుకోవడంలో దివ్య దేశ్‌ముఖ్ కృషి చిరస్మరణీయం.