Divvela madhuri: మహిళల వస్త్రధారణపై మెగాబ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ దివ్వెల మాధురి తీవ్రంగా ఖండించారు. ఇటీవల నటుడు శివాజీ ‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా, వాటికి వ్యతిరేకంగా నటి అనసూయ ఘాటుగా స్పందించారు. అనసూయకు నాగబాబు మద్దతు పలకడంతో ఈ అంశం మరింత చర్చకు దారితీసింది.
ఈ క్రమంలో నాగబాబు వ్యాఖ్యలపై దివ్వెల మాధురి స్పందిస్తూ ఓ యూట్యూబ్ వీడియో విడుదల చేశారు. మహిళల స్వేచ్ఛ అంటే బట్టలు విప్పుకుని తిరగడమే కాదని ఆమె స్పష్టం చేశారు. మగవారితో సమానంగా నిలబడాలంటే మహిళలు ఆర్థికంగా, మానసికంగా బలపడాలే కానీ అర్ధనగ్నంగా తిరగడం స్వేచ్ఛ కాదని వ్యాఖ్యానించారు.
వస్త్రధారణను బట్టి సమాజంలో గౌరవం లభిస్తుందన్న అభిప్రాయాన్ని మాధురి వ్యక్తం చేశారు. సంప్రదాయబద్ధంగా ఉండే మహిళలను చూసే విధానానికి, అసభ్యకరమైన దుస్తులు ధరించిన వారిని చూసే చూపుకు తేడా ఉంటుందని ఆమె అన్నారు. విదేశీయులే భారతీయ సంస్కృతి, చీరకట్టు వంటి సంప్రదాయాలను గౌరవిస్తుంటే, మనమే పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి మన మూలాలను మరిచిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో యాంకర్ అనసూయ గతంలో చేసిన వ్యాఖ్యలపైనా మాధురి స్పందించారు. “నా డ్రెస్సింగ్‌పై నా భర్తకు అభ్యంతరం లేకపోతే మీకెందుకు?” అన్న అనసూయ మాటలను ఆమె తప్పుబట్టారు. ఇంట్లో భర్త దగ్గర ఎలా ఉన్నా పరవాలేదని, కానీ బహిరంగ ప్రదేశాల్లో అర్ధనగ్నంగా ఉంటూ అందరూ అన్నదమ్ముల్లా చూడాలనుకోవడం సాధ్యం కాదని అన్నారు. చూసే చూపు కచ్చితంగా వేసుకున్న బట్టలపైనే ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
మహిళలు ఆధునిక దుస్తులు ధరించడంలో తప్పులేదని, అయితే అవి అసభ్యకరంగా ఉండకూడదని, భారతీయ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలదేనని దివ్వెల మాధురి పిలుపునిచ్చారు.
