Crime News: అపార్ట్‌మెంట్‌లో కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం యువకుడిపై హత్యాయత్నానికి దారి తీసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా యనమలకుదురు శివపార్వతినగర్‌లో జరిగింది. పోలీసుల సమక్షంలోనే 20 మంది యువకుడిపై దాడి చేయగా ఒకరు కత్తితో దాడి చేసేందుకు యత్నించారు. యనమలకుదురులోన ఓ అపార్ట్‌మెంట్‌లో రబ్బానీ అనే యువకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో వీరయ్య అనే బయట వ్యక్తి తన కారును పార్కింగ్ చేసుకునేవారు.
పార్కింగ్ విషయంలో వీరయ్య, రబ్బానీ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కొబ్బరిబొండాలు నరికే కత్తితో రబ్బానీపై వీరయ్య దాడి చేసేందుకు యత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భయపడిన రబ్బానీ పరిగెత్తుకుంటూ తన ఫ్లాట్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని పెనమలూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొన్న తర్వాత బయటకు వచ్చిన రబ్బానీపై అక్కడే ఉన్న వీరయ్య, అతని అనుచరులు 20 మంది మూకుమ్మడి దాడికి పాల్పడ్డాడు.
Also Read: Pranay Murder Case: ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు
ఆ సమయంలో పోలీసులు ఉన్నా దాడికి పాల్పడటంతో రబ్బానీతోపాటు అపార్ట్‌మెంట్ వాసులు పరుగులుపెట్టారు. ఈ ఘటనలో రబ్బానీకి తీవ్ర గాయాలవడంతో పోలీసులు విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.