CAPF Bill: దేశ రాజధాని ఢిల్లీలో నేడు కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. దేశ అంతర్గత భద్రతలో కీలక పాత్ర పోషించే కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) కోసం కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్న ఈ “సాయుధ పోలీసు బలగాల సాధారణ పరిపాలన బిల్లు-2026” ద్వారా మన దేశంలోని ఐదు ప్రధాన రక్షణ దళాలైన సీఆర్పీఎఫ్ (CRPF), బీఎస్ఎఫ్ (BSF), సీఐఎస్ఎఫ్ (CISF), ఐటీబీపీ (ITBP), మరియు ఎస్ఎస్బీ (SSB)లను ఒకే చట్ట పరిధిలోకి తీసుకురానున్నారు. దేశ భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.
ఈ కొత్త బిల్లు అమలులోకి వస్తే, ఈ ఐదు రక్షణ దళాల్లో నియామకాలు, ఉద్యోగుల సర్వీసు నిబంధనలు మరియు ఉన్నత స్థాయి అధికారుల పదవుల నిర్వహణలో సమూల మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న నిబంధనలను ఒకే గొడుగు కిందకు చేర్చడం ద్వారా పాలన మరింత సులభతరం అవుతుంది. ముఖ్యంగా ఈ దళాల్లోని ఉన్నత స్థాయి పోస్టులైన డైరెక్టర్ జనరల్ (DG) పదవులను పూర్తిగా ఐపీఎస్ (IPS) అధికారులకే కేటాయించనున్నారు. అలాగే ఐజీ, ఏడీజీ స్థాయి పోస్టుల్లో కూడా నిర్దిష్ట శాతం ఐపీఎస్ అధికారులకే దక్కేలా చట్టబద్ధమైన నిబంధనలు రూపొందించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, నేటి నుంచే ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘ఎకనామిక్ సర్వే’ను ప్రవేశపెట్టనుంది. రేపు ముఖ్యమంత్రి రేఖా గుప్త ఢిల్లీ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి బడ్జెట్లో కాలుష్య నియంత్రణకు పెద్దపీట వేస్తూ “గ్రీన్ బడ్జెట్” రూపంలో తీసుకువచ్చే అవకాశం ఉందని సమాచారం. పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త పథకాలు, నగర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రకటనలు ఈ సమావేశాల్లో వెలువడే అవకాశం ఉంది.
