Director shankar: తమిళ సినీ ప్రముఖుడు, ప్రముఖ దర్శకుడు శంకర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. 2010లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమా కాపీరైట్ వివాదంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో, ఈడీ ఆయనకు చెందిన రూ.10 కోట్లకు పైగా విలువైన మూడు స్థిరాస్తులను జప్తు చేసింది.
ఈ కేసు మూలాలు 2011కి వెళ్తాయి. తమిళనాడుకు చెందిన అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి తన జిగుబా పుస్తకంలోని కథను కాపీ కొట్టి రోబో సినిమాగా తెరకెక్కించినట్టు ఆరోపిస్తూ ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 1957 కాపీరైట్ యాక్ట్‌ను శంకర్ ఉల్లంఘించారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరాడు.
తాజాగా ఈ కేసులో విచారణ జరిపిన ఎగ్మోర్ కోర్టు, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) నివేదికను పరిశీలించింది. ఆ నివేదిక ప్రకారం, జిగుబా కథకు, రోబో సినిమాకు గణనీయమైన పోలికలు ఉన్నాయని తేలింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ను ఉల్లంఘించినట్లు ఈడీ నిర్ధారించింది.
అంతేకాదు, రోబో సినిమాకు పారితోషకంగా శంకర్ రూ.11.5 కోట్లు అందుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో, మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఫిబ్రవరి 17న ఆయన ఆస్తులను అధికారికంగా జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.