Dil Raju: ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖు నిర్మాత దిల్ రాజు ఈ రోజు ఐటీ అధికారుల ఎదుట హాజరయ్యారు. వారం క్రితం ఆయన ఇంటిలో ఐటీ సోదాల అనంతరం కొన్ని వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలు తీసుకురావాలని ఐటీ అధికారులు ఆనాడే ఆయనకు సూచించారు. ఆ మేరకు ఆయన ఆ వివరాలతో దిల్ రాజు బుధవారం అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
Dil Raju: సినిమాల నిర్మాణం, ఎగ్జిబిషన్ల లాభాల వ్యవహారంపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. తాజా సినిమాల నిర్మాణం, వచ్చిన లాభాల అంశంపైనా వారు వివరాలు సేకరించినట్టు తెలిసింది. వాటిపై సమగ్ర వివరాలను భేరీజు వేసుకుంటున్నారని అంటున్నారు. ఏడాదిగా సినిమాలు, డిస్ట్రిబ్యూషన్ల ఆదాయ, వ్యయాల వివరాలను రాబడుతున్నట్టు సమాచారం.
Dil Raju: ఇటీవల దిల్ రాజు ఇండ్లు, కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ఐటీ అధికారులు సోదాలు జరిపారు. నాలుగు రోజులపాటు ఈ తనిఖీలు జరగడం గమనార్హం. అదే సమయంలో దిల్ రాజు భార్య ద్వారా బ్యాంకు లాకర్లను తెరిపించి కొన్ని డాక్యుమెంట్లను సేకరించినట్టు తెలిసింది. అదే సమయంలో ఆయన వ్యాపారాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Dil Raju: సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ విషయంలోనే ఆయన ఇంటిపై ఐటీ సోదాలు జరిగినట్టు ప్రచారం జరిగింది. అయితే సినిమా వాళ్లపై అసత్య ప్రచారం చేస్తున్నారని, కొన్ని మీడియా చానళ్లు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని దిల్ రాజు గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఇండ్లల్లో రూ.20 లక్షలు కూడా దొరకలేదని, ఏదో జరిగినట్టు ప్రచారం చేయడం తగదని ఆనాడే చెప్పారు. కానీ ఈనాడు మళ్లీ ఐటీ అధికారుల ఎదుట హాజరవడం చర్చనీయాంశంగా మారింది.

