digital snan at maha kumbha mela

Digital Snan at Maha Kumbhamela: ఎవడండీ ఈడు ఇలా ఉన్నాడు.. ఫోటోలకు స్నానం  చేయించి పుణ్యం వచ్చింది పొమ్మంటున్నాడు!

Digital Snan at Maha Kumbhamela: మన దేశంలో ప్రజలకు భక్తి అనేది ఎంత బలంగా ఉంటుందో.. కొంతమందిలో అదే వారికి బలహీనతగా కనిపిస్తుంది. ఒక పూజ చేస్తే మంచి జరుగుతుంది అని ఎవరైనా చెబితే దానిని ఎలాగైనా జరిపించాలని తాపత్రయపడతారు. ఒకవేళ పూజ చేయకపోతే ఏదైనా నష్టం జరుగుతుందేమో అని భయపడతారు. ఇదిగో సరిగ్గా ఇలాంటి బలహీనత మీద ఆదుకోవడానికి కొందరు రెడీ అయిపోతారు. ఇలాంటి బలహీనతలతో ఉండేవారిని పట్టుకుని వారి నుంచి డబ్బు సంపాదించడం చేస్తుంటారు. గతంలో భక్తులను వివిధ ఆలయాల వద్ద ఇలాంటి పూజ చేయండి.. అలాంటి రెమిడీ ఉంది దానితో మీరు కోటీశ్వరులు అయిపోతారు.. ఈ కంకణం కట్టుకుంటే మీకు అద్భుతం జరుగుతుంది ఇలా చెప్పి వారితో ప్రత్యక్షంగా పూజలు చేయించి డబ్బు గుంజేసేవారు. క్రమేపీ కాలం మారింది. ప్రపంచం డిజిటలైజ్ అయిపొయింది. రూపాయి రాక.. పోక కూడా డిజిటల్ గానే అయిపోతోంది. ఈ నేపథ్యంలో మనిషి బలహీనత మీద డబ్బు చేసుకునే ప్రబుద్ధులు కూడా డిజిటల్ బాట పట్టేశారు. 

Digital Snan at Maha Kumbhamela: ప్రజల్ని డిజిటల్ గా దోచేస్తున్నారు. ఉదాహరణకు ఎవరైనా చనిపోతే కాశీలో అస్తికలు నిమజ్జనం చేయాలి అనే ఒక నమ్మకం చాలా మందికి ఉంది. అయితే, అందరూ అక్కడికి వెళ్లడం సాధ్యం కాదు. దీనికోసం డిజిటల్ గా డబ్బు పంపించి.. అస్తికలు కొరియర్ ద్వారా పంపిస్తే.. అక్కడ ఒక మనిషి మన కోసం అస్తికలు నిమజ్జనం చేసే క్రతువు చేస్తారు. వారు ఆ కార్యక్రమం నిర్వహించే సమయంలో ఇక్కడ సంబంధీకులకు లైవ్ వీడియో లింక్ పంపిస్తారు. అక్కడ అస్తికలు నిమజ్జనం జరుగుతుంటే ఇక్కడ బంధువులు వీడియోలో చూసి గంగమ్మకు నమస్కారం చేస్తారు. ఇది  అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దానికి మించిన క్రతువు ఒకటి జరుగుతోంది. ఇది విన్న లేదా చూసిన వారికి మతి పోతుంది. 

Digital Snan at Maha Kumbhamela: మహా కుంభమేళా.. 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని చెబుతున్నారు. అందుకోసం కోట్లాదిమంది భక్తులు వ్యయ, ప్రయాసలకు ఓర్చుకుని ప్రయాగ్ రాజ్ చేరుతున్నారు. అక్కడ పుణ్య స్నానం చేసి జన్మ ధాన్యం అయిపొయింది అని సంబర పడిపోతున్నారు. మరి అక్కడకు అంత కష్టపడి వెళ్లలేని వారి పరిస్థితి ఏమిటి? మహా కుంభ్ లో పుణ్యస్నానం చేసే భాగ్యం దొరకలేదని బాధపడుతున్న వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంటుంది. ఇదిగో అలా బాధ పడేవారిని టార్గెట్ చేసుకున్నాడు ఓ తెలివైన యూ ట్యూబర్. జస్ట్ 1111 రూపాయలు, మీ ఫోటో అతనికి ఆన్ లైన్ ద్వారా పంపిస్తే చాలు.. మీకు పుణ్యస్నానం అతనే చేయించేస్తాడు. 

Digital Snan at Maha Kumbhamela: ఏమిటి.. మా కంటే పిచ్చోళ్ళు దొరకలేదా? తమాషాగా ఉందా? ఏది పడితే అది రాసేస్తావా అని అనకండి. ఇది అక్షరాలా నిజం. డబ్బు.. ఫోటో పంపితే స్నానం ఎలా అయిపోతుంది? అనుకుంటున్నారా? మీరు పంపిన ఫోటోను ప్రింట్ వేయించి దానిని పట్టుకుని సంగం ఘాట్ దగ్గరకు వెళ్లి పవిత్ర త్రివేణీ సంగమంలో మీ ఫోటోను మూడు సార్లు ముంచి.. బయటకు తీసి మీ తరఫున నమస్కారం చేసి.. ఇదంతా లైవ్ వీడియో చేసి మీకు చూపిస్తారు. అంతే.. మీరు పుణ్యస్నానం చేసేసినట్టే. 

Digital Snan at Maha Kumbhamela: ఏయ్.. వేషాలు వేయకు.. మా ఫొటోకు స్నానం చేయిస్తే మేము చేసినట్టు ఎలా అవుతుంది అనకండి. దానికి కూడా ఈ బాబులు సమాధానం రెడీగా పెట్టుకున్నారు. “ఏ చాలా ఆలయాల్లో డిజిటల్ గా డబ్బు పంపిస్తే.. మీపేరుపై పూజ చేసి ప్రసాదాలు పంపుతున్నారుగా?” మరి అలా చేస్తే మీరు స్వయంగా పూజ చేసినట్టు అనుకుంటే.. మీ ఫోటో స్నానం చేస్తే మీరు చేసినట్టు కదా? అంటూ లాజిక్ తో చంపేస్తారు. 

ఇది మహా కుంభమేళాలో నిజంగా జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి వీడియో ఇక్కడ ఉంది చూసేయండి.. ఇది చూస్తే  మీరు కూడా ముక్కున వేలేసుకుంటారు!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *