Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఒక వింత మరియు ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. సాధారణంగా మనం చిన్న పిల్లలకు వేసే డైపర్ కేవలం శుభ్రత కోసమే అనుకుంటాం. కానీ, అదే డైపర్ ఒక 20 రోజుల పసికందు ప్రాణాలను కాపాడి ‘లైఫ్ జాకెట్’లా పనిచేసింది. కోతి దాడి చేసి బావిలో పడేసినా, ఆ పసిపాప సురక్షితంగా బయటపడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. సియోని జిల్లాలోని ఒక గ్రామంలో ఓ తల్లి తన 20 రోజుల పసిబిడ్డతో కలిసి ఇంటి బయట కూర్చుని ఉంది. సరిగ్గా అదే సమయంలో అకస్మాత్తుగా కోతుల మంద అక్కడికి వచ్చి దాడి చేసింది. ఒక కోతి అయితే ఏకంగా తల్లి ఒడిలో ఉన్న పసికందును లాక్కుని పారిపోయింది. కళ్లముందే బిడ్డను కోతి తీసుకెళ్లిపోతుంటే ఆ తల్లి తల్లడిల్లిపోయింది. గ్రామస్తులందరూ కలిసి ఆ కోతిని వెంబడించడంతో, భయపడిన ఆ కోతి పసికందును దగ్గరలో ఉన్న ఒక బావిలో పడేసి పారిపోయింది.
అయితే, బావిలో పడ్డ పాప మునిగిపోకుండా నీటిపై తేలుతూ ఉండటం చూసి గ్రామస్తులు షాక్ అయ్యారు. వెంటనే పాపను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. దీనిపై స్థానిక నర్సు రాజేశ్వరి మాట్లాడుతూ.. పాపకు వేసిన డైపర్ గాలితో ఉబ్బి, నీటిలో తేలేలా చేసిందని, అందుకే ఆ చిన్నారి మునిగిపోకుండా ప్రాణాలతో బయటపడిందని వివరించారు. ప్రస్తుతం ఆ పసికందు క్షేమంగా ఉంది. తమ గ్రామంలో కోతుల బెడద ఎక్కువైందని, అధికారులు స్పందించి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
