Dharmendra: బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయనను బుధవారం ఉదయం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 89 ఏళ్ల ఈ సీనియర్ నటుడు పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు ఆయనను ఇంటికి పంపించారు. ధర్మేంద్ర గత వారం రోజులుగా శ్వాస సంబంధిత సమస్య కారణంగా బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో, ఆయన ఆరోగ్యంపై వెంటిలేటర్, పరిస్థితి విషమం వంటి వార్తలు, అలాగే ఆయన మరణించారంటూ తప్పుడు ప్రచారం కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించాయి.
ఇది కూడా చదవండి: Bihar Exit Poll Results 2025: బిహార్‌లో మళ్లీ ఎన్డీయేదే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే..?
ఈ వదంతులపై ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్, భార్య హేమ మాలిని తీవ్రంగా స్పందించారు. “నాన్నగారు ఆరోగ్యంగా, నిలకడగా ఉన్నారు. చికిత్సకు స్పందిస్తున్నారు. దయచేసి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయవద్దు” అని ఆయన కుటుంబ సభ్యులు పదేపదే విజ్ఞప్తి చేశారు. తాజాగా, వైద్యుల పర్యవేక్షణలో ధర్మేంద్ర కోలుకోవడం, ఆయన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపినట్లు ఆసుపత్రి వర్గాలు, ఆయన కుటుంబ ప్రతినిధులు ధృవీకరించారు. సుమారు ఆరు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ, 89 ఏళ్ల వయసులో కూడా చురుగ్గా సినిమాల్లో నటిస్తున్న ధర్మేంద్ర క్షేమంగా తిరిగి ఇంటికి చేరడంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేశారు.

