Airlines: విమాన ప్రయాణికులపై అదనపు చార్జీల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు ఉచితంగా కేటాయించాలని ఆదేశించాయి. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 20, 2026 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది.
అదనపు వసూళ్లకు చెక్ – పాత పద్ధతికి స్వస్తి
ప్రస్తుత విధానం ప్రకారం, విమానయాన సంస్థలు కేవలం 20 శాతం సీట్లను మాత్రమే ఉచితంగా ఇస్తున్నాయి. మిగిలిన 80 శాతం సీట్లకు (ముఖ్యంగా ముందు వరుస, లెగ్ రూమ్ ఉన్న సీట్లు) ప్రయాణికులు తమకు నచ్చిన చోట కూర్చోవాలంటే రూ. 200 నుండి రూ. 2,100 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు డీజీసీఏ తన ‘వాయు రవాణా సర్క్యులర్’ను సవరించింది. 60 శాతం సీట్లు ఉచితంగా దక్కడం వల్ల సామాన్య ప్రయాణికులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది.
కుటుంబాలకు మేలు – ఒకే PNR ఉంటే పక్కపక్కనే సీట్లు
కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి ప్రయాణించే వారికి ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది.
-
ముఖ్యమైన మార్పు: ఒకే PNRపై టిక్కెట్లు బుక్ చేసినా, విమానంలో వేర్వేరు మూలల్లో సీట్లు కేటాయిస్తున్నారనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి.
-
కొత్త నిబంధన: సాధ్యమైనంత వరకు ఒకే PNR ఉన్న ప్రయాణికులకు ఒకే వరుసలో పక్కపక్కనే సీట్లు కేటాయించాలని విమాన నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది.
-
పారదర్శకత: బుకింగ్ వెబ్సైట్లలో సర్వీస్ ఛార్జీలు, క్రీడా పరికరాలు లేదా సంగీత వాయిద్యాల రవాణా రుసుములను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది.
టిక్కెట్ ధరలు పెరుగుతాయా?
డీజీసీఏ నిర్ణయంపై విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ (FIA) స్పందిస్తూ.. సీట్ల ఎంపిక ద్వారా వచ్చే ఆదాయం తమకు చాలా ముఖ్యమని, 60 శాతం సీట్లు ఉచితంగా ఇస్తే వచ్చే నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రాథమిక విమాన ఛార్జీలను (Base Fares) పెంచే అవకాశం ఉందని హెచ్చరించాయి. అయితే ప్రయాణికుల హక్కులను కాపాడటమే తమ ప్రాధాన్యతని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
