ప్రతి ఏటా విజయదశమి నాడు అర్ధరాత్రి కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో సమరం చేస్తారు. 3 గ్రామాలు ఒక జట్టుగా, 5 గ్రామాలు మరో జట్టుగా ఏర్పడి కొట్లడుతారు.
ఈ ఏడాది దసరా సందర్భంగా బన్నీ ఉత్సవంలో కర్రల సమరంలో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆదోని, బళ్లారి ఆసుపత్రులకు తరలించారు.
దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామి దేవతా మూర్తులను కాపాడుకోవడానికి నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒక వైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరో వైపున కర్రలతో తలబడతారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవరగట్టు బన్నీ ఉత్సవం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. దేవరగట్టుకు దాదాపుగా రెండు లక్షల మందిపైగా భక్తులు పాల్గొన్నారన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం తో పాటు ఇతర జిల్లాలో పనిచేస్తున్న పోలీసులు బన్నీ ఉత్సవంలో ఎంతో పటిష్టంగా తమ విధులను నిర్వర్తించారని ఎస్పీ కొనియాడారు. 60 నుంచి 80 మంది భక్తులకు మైనర్ గాయాలు అయ్యాయని ఎస్పీ తెలిపారు.