Pawan Kalyan: మొంథా తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇవాళ పర్యటించారు. భారీ వర్షాలు, తుపాను బీభత్సానికి దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించి, నష్టాన్ని అంచనా వేశారు.
కృష్ణాపురంలో పర్యటన వివరాలు
కృష్ణాపురంలోని తుఫాన్ ప్రభావిత గ్రామాలకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నష్టపోయిన రైతులను కలిశారు. తుపాను ధాటికి నీట మునిగి, దెబ్బతిన్న పొలాల్లో నడిచి, పంట నష్టం వివరాలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన నష్టపోయిన రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారికి జరిగిన నష్టం, సాగులో ఎదురైన ఇబ్బందులు మరియు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహాయం గురించి ఓపికగా విన్నారు.
ఇది కూడా చదవండి: Khammam: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. పోటెత్తిన మున్నేరు.. ఖమ్మం లో హై అలర్ట్
ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని, తగిన పరిహారం అందించి భరోసా కల్పిస్తామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
ఇతర ప్రాంతాల్లో పర్యటన
కృష్ణాపురంతో పాటు తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న నాగాయలంక మరియు కోడూరు మండలాల్లో కూడా పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగనుంది. ఈ ప్రాంతాల్లో కూడా నష్టపోయిన పంటలు, రోడ్లు, ఇతర మౌలిక వసతుల దెబ్బతిన్న వివరాలను ఆయన తెలుసుకోనున్నారు.
తుఫాన్ సహాయక చర్యలు, పరిహారం పంపిణీపై ముఖ్యమంత్రి మరియు అధికారులతో చర్చించి, రైతులకు త్వరితగతిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
