Pawan Kalyan: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన రైతాంగంలో కొత్త ఆశలు రేపింది. కేశనపల్లి ప్రాంతంలో సముద్రపు నీటితో తీవ్రంగా దెబ్బతిన్న లక్షలాది కొబ్బరి చెట్లను స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటన కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాకుండా, రైతుల బాధలను దగ్గరగా తెలుసుకునే ప్రయత్నంగా కనిపించింది.
పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తాను కేవలం హామీలు ఇచ్చే ముఖ్యమంత్రిని కానని, రైతుల సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి బలంగా తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. ముఖ్యంగా కోనసీమలో నిత్య సమస్యగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. బీసీ రోశయ్య ఇచ్చిన నివేదిక ఆధారంగా, సమస్యను పూర్తిగా అధ్యయనం చేసి తగిన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే, కోనసీమ కొబ్బరి రైతుల చిరకాల కోరిక అయిన కొకొనట్ బోర్డు ఏర్పాటు గురించి కేబినెట్‌లో చర్చిస్తానని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ మాటల్లో కోనసీమ కొబ్బరిని పరిరక్షించుకోవాలనే పట్టుదల కనిపించింది. “గత ప్రభుత్వంలో అభివృద్ధిని మర్చిపోయారు. నేను ఓట్ల కోసమో, హడావుడి చేయడానికో ఇక్కడికి రాలేదు. కోనసీమ రైతాంగం గళం అవుతాను” అని ఆయన బలంగా చెప్పారు. గతంలో సచివాలయ ఉద్యోగుల విషయంలో సర్వీస్ రూల్స్ లేకుండా ప్రభుత్వం వ్యవహరించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఈ సందర్భంగా కొంతమంది కొబ్బరి రైతులు తమ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైతే సినిమా తీయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్, “గత ముఖ్యమంత్రిలా తన దగ్గర డబ్బులు లేవని” వినయంగా చెప్పారు. కానీ, కొబ్బరి రైతులకి శాశ్వత పరిష్కారం దొరకాలని, సమస్య మూలాలను తెలుసుకోవాలని ఉద్ఘాటించారు. చివరగా, కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకు లాంటిదిగా అభివర్ణించి, దాని ప్రాముఖ్యతను తెలియజేశారు. డిసెంబర్ రెండవ వారంలో మళ్లీ కోనసీమకు వస్తానని భరోసా ఇచ్చారు.
