Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌కు కుంకీ ఏనుగుల పంపిణీ అంశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవకు అనుగుణంగా కర్ణాటక ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలో పంటపొలాలను నాశనం చేస్తున్న అడవి ఏనుగుల బెడదను నివారించేందుకు పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఇప్పుడు ఫలితంగా మారుతోంది.
ఇప్పటికే అడవి ఏనుగుల దాడుల వల్ల పలు జిల్లాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు నాశనమవడమే కాక, కొన్ని ప్రాంతాల్లో ప్రాణనష్టాలు కూడా సంభవించాయి. ఈ తరుణంలో సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం కుంకీ ఏనుగుల వినియోగంపై ప్రభుత్వం దృష్టిసారించింది.
కర్ణాటకతో కీలక ఒప్పందం:
గత ఏడాది ఆగస్టులోనే పవన్ కళ్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని సంప్రదించి, శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల అవసరం తెలపగా, సెప్టెంబరులో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి అనుగుణంగా, ఈరోజు అధికారికంగా ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అప్పగించనుంది.
ఇది కూడా చదవండి: M. J. Akbar: మనం వాస్తవాలు మాట్లాడుతాము.. కానీ పాకిస్తాన్ కట్టుకథలు చెప్పుతుంది..
ఈ కార్యక్రమం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలవనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక అటవీ మంత్రి ఈశ్వర్ ఖండ్రే కూడా పాల్గొననున్నారు.
ప్రజా సమస్యలకు పరిష్కార మార్గం:
రైతులు మరియు గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న ఏనుగుల బెడదకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కంకణబద్ధమైంది. ఈ నేపథ్యంలో శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను నియంత్రించేందుకు కీలకంగా మారనున్నాయి. కర్ణాటక నుంచి ఏనుగులు ఏపీకి రాకుండా అటు వారు జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పష్టం చేశారు.

