Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు (శనివారం) కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. కాలుష్య సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ఉప్పాడ సమస్యలపై వివరాలు
ముఖ్యంగా కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షలో భాగం చేశారు. గతంలో కాకినాడ జిల్లాలోని ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులతో జరిగిన ‘మాట-మంతి’ కార్యక్రమంలో వారు లేవనెత్తిన కాలుష్య సమస్యలు, వారి సందేహాలపై పీసీబీ నుంచి పవన్ కల్యాణ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పారిశ్రామిక, మైనింగ్ కాలుష్యంపై చర్చ
కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ కార్యకలాపాల కారణంగా తలెత్తుతున్న పర్యావరణపరమైన ఇబ్బందులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల వల్ల తీరప్రాంతంలో సముద్ర జలాలు కలుషితమై, మత్స్య సంపదకు, మత్స్యకారుల జీవనోపాధికి నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Also Read: Anita: విగ్రహానికి ఎవరు నిప్పుపెట్టారో తప్పకుండా వెలికి తీస్తాం
పొల్యూషన్ ఆడిట్‌కు విధివిధానాలు
కాలుష్యాన్ని అంచనా వేయడానికి ‘పొల్యూషన్ ఆడిట్’కు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలపై కూడా ఉప ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. కాలుష్య నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
కేవలం కాకినాడ జిల్లాకే పరిమితం కాకుండా, గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రస్తుత కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కూడా పవన్ కల్యాణ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడకూడదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు.