GST: మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) సినిమా టికెట్లపై జీఎస్టీ రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం రూ.100 కంటే ఎక్కువ ధర ఉన్న టికెట్లపై 18 శాతం, రూ.100 లోపు టికెట్లపై 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. ఈ రేట్లను సవరించి, రూ.300 వరకు టికెట్లపై 5 శాతం జీఎస్టీ, అంతకు మించిన వాటిపై 18 శాతం జీఎస్టీ విధించాలని ఎంఏఐ సూచించింది. ఈ మార్పు సినిమా టికెట్ల ధరలను తగ్గించి, ప్రేక్షకుల సంఖ్యను పెంచుతుందని, కోవిడ్ తర్వాత కష్టాల్లో ఉన్న సినిమా రంగానికి ఊతం ఇస్తుందని ఎంఏఐ అధ్యక్షుడు కమల్ గియాన్‌చందానీ అన్నారు. గత ఏడేళ్లుగా ఈ అంశంపై ఆర్థిక, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలకు విజ్ఞప్తి చేస్తున్నామని, రూ.100 పరిమితి ఇప్పటి పరిస్థితులకు సరిపోదని ఆయన వెల్లడించారు.
