Delhi: ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ ఎవరిని నిర్ణయిస్తుంది. ఎవరు ఎంపికవుతారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా ఎవరిని నిర్ణయిస్తారు.. అన్న విషయాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఎన్డీయే కూటమిలోని పార్టీలతో పాటు ఇటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలన్నింటికీ అంతుచిక్కకుండా ఉన్నది. ఎన్డీయే కూటమి పక్షాల్లో ఎవరికైనా అవకాశం ఇస్తారా? ఇండియా కూటమి తరఫున పోటీచేయాలా? వద్దా? అన్న విషయాలపైనా ఆసక్తికరంగా మారింది.
Delhi: ఉపరాష్ట్రపతి ఎంపిక అంశంపై ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్‌షాలు గుంభనంగా కసరత్తును పూర్తి చేసినట్టు తెలుస్తున్నది. గతంలోనే ఎన్డీయే పార్టీలన్నీ ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేసినా తమకు సమ్మతేనని తేల్చి చెప్పాయి. ఆదివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ప్రకటిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ, మోదీ, షాలు అభ్యర్థిని మాత్రం ఖరారు చేయనేలేదు. దీంతో మరింత ఉత్కంఠ పెరిగింది.
Delhi: ఇదిలా ఉండగా, తాజాగా జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా ఉపరాష్ట్రపతి ఎంపిక బాధ్యతను ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలకే అప్పగించింది. చర్చోపచర్చల అనంతరం వారిద్దరూ సోమవారం (ఆగస్టు 17) నాడు అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ఆగస్టు 21వ తేదీ వరకూ నామినేషన్ల గడువు ఉన్నది. ఎన్డీయే అభ్యర్థితో సోమవారం నామినేషన్ వేయిస్తారని ప్రచారం జరుగుతున్నది.
Delhi: తాజామాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన తర్వాత పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి వరకూ పలువురి పేర్లను పరిశీలించినట్టు సమాచారం. వెంకయ్యనాయుడు ఇటీవలే ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ దశలో ఆయనకూ మరోసారి అవకాశం ఇస్తారేమోనని ప్రచారం జరుగుతున్నది.
Delhi: అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జగదీప్ ధన్‌ఖడ్‌ను ఉపరాష్ట్రపతిగా ప్రకటించే ముందు వారి పేర్లు ప్రచారంలోకి రాకపోవడం గమనార్హం. దీన్నిబట్టి తుది ఎంపిక వరకూ మోదీ, షాలు గుంభనంగా ఉంటారని తేలింది. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎంపిక విషయంలోనూ అదే గోప్యతను పాటిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సమీకరణాల అనంతరం ఇప్పుడు కూడా ఎవరూ ఊహించని అభ్యర్థిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
Delhi: ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ నెల రోజుల నుంచే ముమ్మర కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేసేందుకు అవకాశం ఉన్న ప్రముఖులతో బీజేపీ అగ్రనేతలు చర్చలు సాగిస్తున్నారు. అలాంటి వారిలో ఢిల్లీ, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లు వీకే సక్సేనా, మనోజ్ సిన్హా, బీహార్, గుజరాత్, కర్ణాటక, సిక్కిం గవర్నర్లు ఆరిఫ్ మహమ్మద్ సక్సేనా, ఆచార్య దేవ్‌వ్రత్, థావర్ చంద్ గెహ్లాట్, ఓం మాథుర్ తదితరులు రేసులో ఉన్నారు.
Delhi: విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆర్ఎస్ఎస్ సిద్ధంతకర్త శేషాద్రి చారి పేరు కూడా ప్రచారంలో ఉన్నది. బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ను కూడా అభ్యర్థిగా ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగతున్నది. ఇప్పటికే పైవారందరి అభ్యర్థిత్వాలపై కసరత్తు జరిగినట్టు తెలుస్తున్నది. వారిలో ఎవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలుస్తారో ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనున్నది.