Delhi: హమ్మయ్య..త్వరలో ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ

Delhi:ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల నుంచి నిధుల ఉపసంహరణను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2026 మార్చిలోపు ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.

ఈపీఎఫ్ఓ చందాదారులకు ఉపసంహరణ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్ము పూర్తిగా ఉద్యోగులదేనని స్పష్టం చేసిన మంత్రివర్యులు, ఆ మొత్తాన్ని ఉపసంహరించుకునే ప్రక్రియ సులభంగా ఉండాలని కేంద్రం భావిస్తోందన్నారు.

తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మన్‌సుఖ్ మాండవీయ ఈ అంశంపై మరిన్ని వివరాలు వెల్లడించారు. ఎటువంటి కారణం చూపకుండా పీఎఫ్ ఖాతాలోని మొత్తంలో 75 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏటీఎం ద్వారా పీఎఫ్ ఉపసంహరణకు సంబంధించిన సాంకేతిక ప్రక్రియ కొనసాగుతోందని, నిర్ణీత గడువులోగా ఇది అమల్లోకి వస్తుందని తెలిపారు.

ఇప్పటివరకు పీఎఫ్ నిధులు తీసుకోవాలంటే ఉద్యోగులు అనేక పత్రాలు సమర్పించాల్సి వస్తోందని ఆయన గుర్తు చేశారు. అయితే ఇప్పటికే ఆధార్, యూఏఎన్ అనుసంధానం పూర్తయిందని పేర్కొన్నారు. పీఎఫ్ ఖాతాను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయడం ద్వారా డెబిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం నుంచే నిధులు ఉపసంహరించుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులకు పీఎఫ్ ఉపసంహరణ మరింత సులభంగా, వేగంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *