Delhi: భారత వాయుసేన చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఉగ్రవాదులు మరియు వారికి మద్దతు ఇచ్చే శక్తులే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు డీజీఎంవో ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు. “మన పోరాటం ఉగ్రవాదంపై సాగుతోంది, కానీ పాకిస్తాన్ మాత్రం దాన్ని తమపై దాడిగా భావిస్తోంది. ఉగ్రవాదానికి పాక్ పూర్తిగా అండగా నిలిచింది,” అని ఆయన తెలిపారు.
పాక్ పలు రకాల డ్రోన్లను వినియోగించిందని, వాటిని దేశీయంగా అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో అడ్డుకున్నాం అని పేర్కొన్నారు. ముఖ్యంగా, ఆకాశ్ క్షిపణుల వ్యవస్థ ద్వారా చైనా తయారీ పీఎల్–15 మిస్సైళ్లను సమర్థంగా నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. పాక్ వైమానిక స్థావరాలైన నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్ పై భారత వాయుసేన దాడి నిర్వహించిందని, ఆ ఎయిర్‌బేస్ రన్‌వేకు భారీ నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు.
“ఉగ్రవాదులు ఇప్పుడు కేవలం సైనికులకే కాకుండా యాత్రికులు, భక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో పాక్ మన వైమానిక స్థావరాలను టార్గెట్ చేసింది. కానీ మల్టీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ద్వారా వాటిని సమర్థంగా అడ్డుకున్నాం. శత్రువు మన స్థావరాలను ధ్వంసం చేయడంలో విఫలమైంది,” అని చెప్పారు.
“దేశ ప్రజల మద్దతుతో మేము ముందుకు సాగుతున్నాం. శత్రు దేశ విమానాలను మన దేశ గగనతలంలోకి రానివ్వలేదు. అన్ని సైనిక స్థావరాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఏ ఆపరేషన్‌కైనా మేము సిద్ధంగా ఉన్నాం. పాక్‌కు జరిగిన నష్టాన్ని వారు బయటికి చెప్పుకోవడం లేదు,” అని డీజీఎంవో స్పష్టం చేశారు.