Delhi: దేశీయ విమాన టికెట్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా గరిష్ఠ పరిమితులను నిర్ణయించింది. దేశంలో విమాన ప్రయాణ ఖర్చులు నియంత్రణలో ఉండేలా ఈ టారిఫ్ క్యాప్‌లను అమలు చేయనున్నట్లు తెలిపింది. మార్గ దూరాన్ని బట్టి చార్జీల గరిష్ఠ పరిమితులను విధిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది.
500 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే విమానాలకు గరిష్ఠ టికెట్ ధరను రూ. 7,500గా నిర్ణయించింది. 500 నుండి 1000 కిలోమీటర్ల మధ్య ఉండే ప్రయాణాలకు గరిష్ఠంగా రూ. 12,000 వరకు వసూలు చేయవచ్చు. 1000 నుండి 1500 కిలోమీటర్ల మధ్య దూరం ఉన్న రూట్లపై టికెట్ ధరలు అత్యధికంగా రూ. 15,000 మించకూడదని స్పష్టం చేసింది. 1500 కిలోమీటర్లకు పైబడే ప్రయాణాల కోసం గరిష్ఠ టికెట్ ధరను రూ. 18,000గా నిర్ణయించారు.
కానీ ఈ ధర పరిమితులు అన్ని రకాల విమానాలకు వర్తించవని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా బిజినెస్ క్లాస్ టికెట్లు, అలాగే RCS (రీజినల్ కనెక్టివిటీ స్కీమ్) మరియు UDAN పథకాల కింద నడిచే విమానాలకు ఈ చార్జీల పరిమితులు వర్తించవని స్పష్టంచేసింది.

