Delhi Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమిపై పలువురు ప్రముఖులు స్పందించారు. ఆ పార్టీ స్వయంకృతాపరాధం అని కొందరు. కాంగ్రెస్‌తో పొత్తలేకే ఓటమి పాలయిందని మరికొందరు, అవినీతి మరకే ఆ పార్టీని ఓడించిందని ఇంకొందరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆప్ అగ్రనేతలైన కేజ్రీవాల్, సిసోడియా సహా పలువురు ముఖ్యులు ఓటమి పాలు కావడం గమనార్హం. ఇప్పటి వరకూ అందిన సమాచారం మేరకు బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యతలో ఉండగా, ఆప్ కేవలం 23 సీట్లలో లీడ్‌లో కొనసాగుతున్నది. కాంగ్రెస్ ఏ ఒక్కస్థానంలోనూ ఆధిక్యత చూపలేక చతికిలపడింది.
అధికార దాహంతోనే ఓటమి: అన్నా హజారే
Delhi Elections: అర్వింద్ కేజ్రీవాల్‌కు గురువు లాంటి వ్యక్తి అయిన అన్నా హజారే గత కొన్నాళ్లుగా కేజ్రీవాల్ వైఖరిని తప్పుబడుతూ వస్తున్నారు. అధికార దాహంతో అవినీతి మరకలతోనే ఆప్ ఓటమి పాలైందని ఆయన తాజాగా అభిప్రాయం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కామ్‌తో కేజ్రీవాల్ అప్రతిష్టపాలయ్యారని విమర్శించారు. అందుకే కేజ్రీవాల్‌ను ఢిల్లీ ప్రజలు ఓడించారని పేర్కొన్నారు.
ఐక్యతాలోపమే బెడిసికొట్టింది: ఒమర్ అబ్దుల్లా
Delhi Elections: ఇండియా కూటమిలో ఐక్యతాలోపమే ఢిల్లీ ఎన్నికల్లో బెడిసి కొట్టిందని, ఆప్, కాంగ్రెస్ రెండూ ఓటమిని చవిచూశాయని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. మీలో మీరు పోరాడండి.. అంటూ ఆప్, కాంగ్రెస్‌ను ఉద్దేశించి గతంలోనే ఆయన ఎద్దేవా చేశారు. ఇంకా కొట్లాడుకోండి, ఇంకా దారుణ ఫలితాలు చవిచూస్తారు.. అంటూ పేర్కొంటూ ఢిల్లీ ఫలితాలపై స్పందిస్తూ రామాయణం వీడియోను ఒమర్ అబ్దుల్లా షేర్ చేశారు.
ప్రియాంకాగాంధీకి చురకలు
Delhi Elections: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా స్పందించిన తీరుపై మీడియా ఆశ్యర్యం వ్యక్తంచేయగా, పలువురు విశ్లేషకులు చురకలు అంటించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమై గంటలు గడిచినా ఆమె ఇంకా ఫలితాల సరళిని ఎందుకు తెలుసుకోలేదని ఆమె చెప్పడంపై మండిపడ్డారు. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలు తీసుకొన్న ఆమె ఫలితాల గురించి తెలుసుకోలేదనడంపై ఆమె నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతున్నారు.
కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
Delhi Elections: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ ఫలితాలపై సెటైరికల్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడానికి సహాయ పడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి కంగ్రాట్స్ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. ఆప్‌తో పొత్తుకు విఘాతం కలిగించి పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరించారంటూ అర్థం వచ్చేలా ఆయన ఈ ట్వీట్ చేశారంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆప్‌ను చీపురుతో ఊడ్చేశారు: బండి సంజయ్
Delhi Elections: ఆప్‌ను ఢిల్లీ ప్రజలు చీపురుతో ఊడ్చేశారని బీజేపీ కేంద్ర సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్య పాలన కోరుకున్నారని, అందుకే బీజేపీని గెలిపించుకున్నారని తెలిపారు. ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని చెప్పుకొచ్చారు. ఆ ఊపుతో తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

