Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక పెద్ద సైబర్ మోసం బయటపడింది. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక ఎన్‌ఆర్‌ఐ వృద్ధ వైద్య దంపతులను మోసగించి, ఏకంగా రూ.14.85 కోట్లు కాజేశారు. మనీ లాండరింగ్ ఆరోపణల పేరుతో భయపెట్టి, వారి ఇంట్లోనే నిరంతరం నిఘాలో ఉంచి ఈ ఘోరానికి పాల్పడ్డారు.
గ్రేటర్ కైలాష్‌లో నివసించే డాక్టర్ ఓం తనేజా మరియు డాక్టర్ ఇందిరా తనేజా దంపతులు సుమారు 48 ఏళ్ల పాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేసి, 2015లో భారత్‌కు తిరిగి వచ్చారు. గత సంవత్సరం డిసెంబర్ 24న వారికి పోలీసు లేదా టెలికాం అధికారులమని చెప్పుకుంటూ తెలియని నంబరు నుంచి ఫోన్ వచ్చింది. వారి పేర్లపై మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయని, అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని నేరగాళ్లు భయపెట్టారు.
దీంతో భయంతో వణికిపోయిన ఆ వృద్ధ దంపతులను కేటుగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ చేయించారు. డిసెంబర్ 24 నుంచి జనవరి 10 వరకు, అంటే వరుసగా 17 రోజులు వీడియో కాల్స్‌లో వారి ప్రతి కదలికను పర్యవేక్షించారు. నకిలీ RBI మరియు సుప్రీం కోర్టు పత్రాలు చూపిస్తూ మరిన్ని బెదిరింపులు చేసి, డబ్బు చెల్లిస్తే కేసులు రద్దు చేస్తామని నమ్మించారు.
ఈ భ్రమలో పడిన దంపతులు, విడతలుగా ఎనిమిది బ్యాంక్ ఖాతాలకు మొత్తం రూ.14.85 కోట్లు బదిలీ చేశారు. ఇందులో డాక్టర్ ఇందిరాను బ్యాంకుల్లోకి పంపి స్వయంగా లావాదేవీలు చేయించటం కూడా ఉంది. చివరకు జనవరి 10న సైబర్ నేరగాళ్లు కాల్ కట్ చేస్తూ “డబ్బు RBI ఆదేశాలతో తిరిగి వస్తుంది, పోలీస్ స్టేషన్‌కి వెళ్ళండి” అని చెప్పడంతో అప్రమత్తమయ్యారు. పోలీసులను సంప్రదించాకే తాము మోసపోయామని దంపతులు గ్రహించారు.
బాధితుల ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా దానిని ప్రత్యేక సైబర్ యూనిట్‌కు బదిలీ చేశారు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్‌కి స్పందించవద్దని అధికారులు హితవు పలికారు.
