Delhi: భారత్‌తో వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో, భారత దిగుమతులపై 25 శాతం అదనపు సుంకం (టారిఫ్) విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
ఈ చర్యపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అమెరికా నిర్ణయం ఏకపక్షమని, అన్యాయమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు.
> “ఇది అహేతుకమయిన, అన్యాయ నిర్ణయం. దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు భారత్ తీసుకుంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.
రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత వైఖరిని ఇప్పటికే ఎన్నోసార్లు వివరించామని విదేశాంగ శాఖ పేర్కొంది.
> “140 కోట్ల జనాభాకు ఇంధన భద్రత కల్పించాలన్నదే మా లక్ష్యం. ప్రపంచ మార్కెట్ పరిస్థితుల్ని బట్టి మా కొనుగోలు నిర్ణయాలు ఉంటాయి. ఇతర దేశాలు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఇలాగే చేస్తున్నారు. అలాంటప్పుడు భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం నిరాశాజనకమైంది” అని పేర్కొంది.
ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులో, ఉక్రెయిన్‌పై రష్యా చర్యల నేపథ్యంలో విధించిన ఆంక్షలను మరింత బలపరచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారత్ రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు దిగుమతి చేసుకోవడం అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఉత్తర్వు అమల్లోకి వచ్చిన 21 రోజుల తర్వాత అమెరికాలోకి రానున్న భారతీయ దిగుమతులపై 25 శాతం అదనపు సుంకం అమలులోకి వస్తుంది. అయితే సెప్టెంబర్ 17లోపు ఇప్పటికే రవాణాలో ఉన్న, క్లియరెన్స్ పొందిన వస్తువులకు మినహాయింపు వర్తిస్తుందని స్పష్టం చేశారు.
